Komatireddy Rajagopal Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy countered CM Revanth Reddys remarks once again
  • సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్న రేవంత్
  • సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదన్న కోమటిరెడ్డి
  • వీరికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సామాజిక బాధ్యతతో పని చేసే వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదని సూచించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని అన్నారు. సమాజం కోసం నిబద్ధతతో పని చేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. 

ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పని చేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప... అవమానించడం సరికాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి శక్తిమేరకు పని చేస్తోందని చెప్పారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. 

ఇటీవల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రధాన మీడియా జర్నలిస్టుల నుంచి వీరిని వేరు చేయాలని సూచించారు. రోడ్ల మీద తిరిగేవాడు, ఎక్కువ తిట్లు వచ్చినోడు జర్నలిజం ముసుగు తొడుక్కుని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు.
Komatireddy Rajagopal Reddy
Congress
Telangana
Revanth Reddy

More Telugu News