Kolusu Parthasarathy: కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి జగన్ లో ఫ్రస్టేషన్: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathy Slams Jagan Reddy Over Frustration and Personal Attacks
  • మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ మంత్రి పార్థసారథి
  • భయంతో దిగజారి మాట్లాడుతున్నాడని ఫైర్
  • చంద్రబాబుపై ఆయన వ్యాఖ్యలే నిదర్శనం
  • ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశా కానీ ఇలాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదన్న మంత్రి
  • గెలిచినా ఓడినా నాయకులు ప్రజా సమస్యలపై హుందాగా మాట్లాడేవారని వెల్లడి
  • జగన్ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని విమర్శ
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఈ రోజు ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 
రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు, వారి విధ్వంసకర విధానాలు చూస్తుంటే రాజకీయ నేతగా చాలా బాధేస్తున్నదని మంత్రి చెప్పారు. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన తనకు మూడు దశాబ్దాల అనుభవం ఉందని గుర్తుచేస్తూ.. నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాలను చాలా దగ్గరి నుంచి చూస్తున్నానని తెలిపారు. అయితే, వైసీపీ నేతలు వ్యవహార తీరును తాను ఏనాడూ చూడలేదని చెప్పారు.
 
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎంత ఘాటుగా విమర్శించినా కూడా ఎక్కడా ఎవరూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. నేతలను కించపరిచేలా మాట్లాడటం, అప్రజాస్వామికంగా మాట్లాడటం ఎక్కడ కూడా తాను చూడలేదన్నారు. అధికార పక్షాన్ని కించపరచడం కోసం అరాచక శక్తులని ప్రోత్సహించడం ఎప్పుడూ చూడలేదన్నారు. హుందాగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా పోరాటాలు చేసేవారని చెప్పారు. ఈరోజు వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీరు చూస్తుంటే చాలా బాధేస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గెలుపు ఓటములు సర్వసాధారణం కానీ గెలిచినా ఓడినా నైతిక రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ప్రతీ రాజకీయ నేతపై ఉందన్నారు. బహుశా వైనాట్ 175 నుంచి 11 స్థానాలకు పడిపోవడం మూలంగా జగన్ ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా విధ్వంసకర పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తోందని మంత్రి తెలిపారు.
 
ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి క్రిందిస్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలని మంత్రి పార్థసారథి హితవు పలికారు. జగన్ పర్యటనలు చూసినా, ఆయన ఉపన్యాసాలు చూసినా ఆయన పత్రికా ప్రకటనలు చూసినా ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుందని మంత్రి చెప్పారు. ఆయనలో ఏదో ఒక అభద్రతా భావం కనపడుతుందన్నారు. మాటల్లో నియంత్రణ కోల్పోవటం, వ్యక్తిగత దూషణలకి దిగటం జగన్ కు పరిపాటైందన్నారు. తాను ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని, ప్రస్తుతం చంద్రబాబు దగ్గర మంత్రిమండలిలో ఉన్నానని చెప్పారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, రోశయ్య కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి ఎవరైనా సరే.. నాలాంటి మంత్రులు ఎవరైనా అప్రజాస్వామికంగా మాట్లాడినా లేకపోతే ఏదైనా భాష సరిగ్గా లేకున్నా కూడా మందలించేవాళ్ళని చెప్పారు. కానీ మమ్మల్ని ఎక్కడా తిట్టమని ప్రోత్సహించలేదని వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు కూడా కక్షపూరిత రాజకీయాలు మనకు వద్దని, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మీ మీ ఆలోచనలకి పదును పెట్టాలని చెబుతారని మంత్రి వివరించారు.
 
గంజాయి బ్యాచ్ కు పరామర్శలా..?

గంజాయికి బానిసై సమాజంలో అరాచకాలు సృష్టిస్తూ ఆడపిల్లల్ని హింసిస్తున్న వారి మీద పోలీసులు చర్యలు తీసుకుంటే జగన్ వెళ్లి వారిని పరామర్శిస్తున్నాడని మంత్రి మండిపడ్డారు. శాసన సభ్యురాలిగా ఉన్న ఒక సోదరిని నీచాతి నీచంగా దిగజారి మాట్లాడితే అతన్ని మందలించాల్సింది పోయి పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. మహిళల పట్ల జగన్ కు ఉన్న గౌరవం ఏమిటో ఈ ఘటనే చెబుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యమైన భాష మాట్లాడితే తప్పులేదు. కానీ చాలా అనైతికంగా, దిగజారుడుతనంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ఇటువంటి భాషని వాడే మీరందరూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
సంక్షేమం గురించి మాట్లాడడం వేరు, సంక్షేమం చేసి చూపించడం వేరని మంత్రి చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వంలో అందే సంక్షేమం కొత్త చరిత్రను తిరగరాస్తోందని, గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని స్థాయి సంక్షేమాన్ని నేడు ప్రజలు అందుకుంటున్నారని మంత్రి చెప్పారు. జగన్ లో ప్రస్టేషన్ కు ఇది కూడా కారణం కావచ్చని ఎద్దేవా చేశారు. ప్రజల్లో అన్ని వర్గాల్లో పాజిటివ్ వస్తే తన పరిస్థితి ఏమీ మిగలదు అని ఇలా వ్యవహరిస్తున్నాడు అనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. 
 
‘దేశంలో నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం మరొకటి ఉందా? ఈ నెలతో కలిపి దగ్గర దగ్గర రూ. 40 వేల కోట్లు కేవలం పింఛన్లపై ఖర్చు చేశాం. ఇది కాదా సంక్షేమం? తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఆర్థిక సాయం చేశాం. దీనికి దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశాం. నాకు డబ్బులు పడలేదు అని ఎవరూ చెప్పే పరిస్థితి లేకుండా చేశాం. దీన్ని ఏమంటారు? 204 అన్న క్యాంటీన్లు పెట్టాం.... ఇప్పటికి 4 కోట్లమందికి పైగా భోజనాలు చేశారు. అంటే జగన్ భాషలో పేదల కడుపునింపడం సంక్షేమం కాదా? 47 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో  దాదాపు రూ.3200 కోట్లు వారి అకౌంట్లో జమ  చేశాం .....ఇది రైతు సంక్షేమం కాదా? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. జగన్ కళ్లు మూసుకుని సంక్షేమం లేదు అని పదే పదే  గోల పెట్టి... అదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం.... పోలీస్ రిక్రూట్ మెంట్ చేస్తున్నాం...పెట్టుబడుల తెచ్చి మళ్లీ పారిశ్రామిక రంగంలో ఊపు తెచ్చాం. ఇవన్నీ కనిపించడంలేదా ?ప్రతి వర్గానికి సాయంగా నిలుస్తున్నా.. ఉచిత ఇసుక తెచ్చి నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాలి. ప్రభుత్వాలను పశ్నించాలి. ప్రజల కోసం పనిచేయాలి. కానీ జగన్ కు తన సొంత ఉనికి, ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టవు. ఇలాంటి రాజకీయ పార్టీలు చరిత్రలో మనుగడ సాగించలేదు.. జగన్ యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ గా చరిత్రలో నిలిచిపోతారు ప్రజలు కూడా ఇలాంటి వారి పట్ల చైతన్యంతో ఉండాలి. మంచి చెడు చూడాలి’ అని మంత్రి పార్థసారథి చెప్పారు.
Kolusu Parthasarathy
Andhra Pradesh
TDP
YS Jagan
Chandrababu Naidu
AP Politics
Welfare schemes
Political criticism
YSRCP
Telugu Desam Party

More Telugu News