Viral Video: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. సడన్‌ బ్రేక్‌ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ

Caught on camera Infant falls from moving bus after driver applies sudden brake
  • తమిళనాడులో కదులుతున్న బస్సు నుంచి జారిపడ్డ ఏడాది బాలుడు
  • డ్రైవర్ హఠాత్తుగా బ్రేకులు వేయడంతో తల్లి చేతిలోంచి జారిన చిన్నారి
  • అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ పసికందు
  • సమీపంలోని ఓ వృద్ధుడు వెంటనే స్పందించి బాలుడిని కాపాడిన వైనం 
  • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులోంచి ఏడాది వయసున్న పసికందు అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయాడు. డ్రైవర్ హఠాత్తుగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఆ చిన్నారి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బస్సులోని కెమెరాలో రికార్డయి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. జులై 31న మధురై నుంచి శ్రీవిల్లిపుత్తూరు వైపు ఓ ప్రైవేట్ బస్సు వెళ్తోంది. శ్రీవిల్లిపుత్తూరు సమీపంలోని ముత్తులింగాపురం గ్రామానికి చెందిన మధన్ కుమార్, తన సోదరి, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు డోర్ దగ్గర మధన్ కుమార్ తన రెండేళ్ల మేనల్లుడితో కూర్చొని ఉండగా, అతని సోదరి తన ఏడాది కొడుకును చేతిలో పట్టుకొని కూర్చుంది.

మీనాక్షిపురం గ్రామం వద్దకు రాగానే బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో బస్సు ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు అదుపుతప్పారు. అదే సమయంలో తల్లి చేతిలో ఉన్న ఏడాది బాలుడు పట్టుతప్పి డోర్‌లోంచి రోడ్డుపై పడిపోయాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో బస్సు లోపల ఉన్న మధన్ కుమార్, అతని రెండేళ్ల మేనల్లుడు కూడా కింద పడటంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. మధన్ కుమార్ ముఖానికి దెబ్బలు తగిలినట్టు సమాచారం.

అయితే, రోడ్డుపై పడిన చిన్నారిని సమీపంలోనే ఉన్న ఓ వృద్ధుడు వెంటనే గమనించి పరుగెత్తుకెళ్లి కాపాడాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బాలుడికి కేవలం చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది.
Viral Video
Bus Accident
Tamil Nadu
Road Accident
Infant Safety
Bus Driver
Srivilliputhur
Madurai
Public Transport
Child Safety

More Telugu News