Harshavardhan: బీమా సొమ్ము కోసం తండ్రినే అంతం చేయాలన్న ప్లాన్ .. బెడిసికొట్టి హత్యాయత్నం కేసులో జైలుకు!

Harshavardhan Plans Fathers Murder for Insurance Money Fails
  • తండ్రిని కారుతో ఢీకొట్టి ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు
  • పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి
  • నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు
  • కొడుకుపై కేసు వద్దంటూ తండ్రి వేడుకోలు
బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే అంతమొందించాలని ఓ తనయుడు పథకం వేశాడు. అయితే ప్రమాదం నుంచి తండ్రి బయటపడటంతో ఆ పథకం బెడిసికొట్టి, హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నాడు.

వివరాల్లోకి వెళితే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలోని సాకుర్రు గ్రామానికి చెందిన హర్షవర్థన్ (24) డిప్లొమా చదివి ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడటంతో పాటు వైసీపీ కార్యక్రమాలకు సైతం డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యాడు. తండ్రి వెంకటరమణ పేరుతో ఓ ఫైనాన్స్ సంస్థలో 2022లో రూ. 13 లక్షల అప్పు తీసుకోవడంతో పాటు బీమా చేయించాడు. తండ్రి మరణిస్తే బీమా సొమ్ము వస్తుందని, అప్పు కూడా తీర్చాల్సిన అవసరం ఉండదని భావించిన హర్షవర్థన్ తండ్రిని హత్య చేసేందుకు పథకం వేశాడు.

ఈ క్రమంలో హర్షవర్థన్ ఈ ఏడాది ఏప్రిల్ 21న భట్నవిల్లి నుంచి తండ్రికి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు లేవని, రూ.500 తీసుకురమ్మని కోరాడు. వెంకట రమణ అక్కడికి చేరుకుని డబ్బులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా, అప్పటికే అద్దెకు తీసుకున్న కారుతో సిద్ధంగా ఉన్న హర్షవర్థన్ మార్గమధ్యంలో తండ్రిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టి వెళ్లిపోయాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్లు ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంకట రమణ కొద్దిరోజుల తర్వాత కోలుకున్నాడు. ప్రమాదం జరిగిన తీరు, హర్షవర్థన్ చెబుతున్న వివరాలపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇంతలో నిందితుడు స్థానిక వీఆర్వో వద్ద లొంగిపోయాడు. హర్షవర్థన్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, కేసు వద్దని, కుమారుడు జైలు కెళ్తే తట్టుకోలేనని నిందితుడి తండ్రి పోలీసులను ప్రాధేయపడినట్లు తెలిసింది. 
Harshavardhan
insurance money
father murder attempt
Sakurru village
Andhra Pradesh crime
Amalapuram
Venkata Ramana
crime news
police investigation

More Telugu News