Pawan Kalyan: కూల్చివేతలతో గత ప్రభుత్వం మొదలైంది.. కూటమి ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తోంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan Says Coalition Govt Building Roads After Demolitions
  • ఒక దేశ ప్రగతికి చిహ్నాలు రోడ్లు, రవాణా మార్గాలేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్య
  • ఏపీలో రూ. 5 వేల కోట్లతో 29 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు వెల్లడి
  • 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నామన్న పవన్ కల్యాణ్
గత ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభమైతే, కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చి కొత్త రహదారులను నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒక దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలని ఆయన అన్నారు. రూ. 5 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో రూ. 5 వేల కోట్లతో 29 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో కీలకమైన ప్రాజెక్టులను చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం హైవేల నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అడవితల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లను నిర్మిస్తున్నారని తెలిపారు. 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు.

డోలీ మోతలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగైన రోడ్లపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. నిన్నటి వరకు కూల్చివేతల ప్రభుత్వం, రోడ్లు వేయని ప్రభుత్వాన్ని చూశామని, మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలన్నింటిని ఐక్యతతో ఛేదిద్దామని పిలుపునిచ్చారు. కూటమి నాయకుల మధ్య పొరపొచ్చలు వచ్చినా పరిష్కరించుకొని కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు ప్రధాన ఆదాయం మౌలిక వసతుల కల్పన అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan
Andhra Pradesh
AP roads
Nitin Gadkari
Chandrababu Naidu
National Highways

More Telugu News