Supreme Court of India: ఇలాగే కొన‌సాగితే.. హిమాచల్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది: సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక

Himachal Pradesh environmental crisis Supreme Court issues warning
  • హిమాచల్‌లో నెలకొన్న పర్యావరణ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఆందోళ‌న‌
  • జాగ్రత్తలు తీసుకోకపోతే రాష్ట్రం కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటూ వ్యాఖ్య‌
  • ఈ రుతుపవనాలతో రూ.1500 కోట్ల భారీ నష్టం
  • వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 88 మంది మృతి
  • అడ్డూఅదుపూ లేని పట్టణీకరణే కారణమంటున్న నిపుణులు 
హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న పర్యావరణ సంక్షోభంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులను అరికట్టడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి తక్షణమే కఠిన చర్యలు చేపట్టకపోతే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చ‌రించింది. రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఇటీవల విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ రుతుపవన కాలంలో హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో హిమాలయ ప్రాంతం అతలాకుతలమవుతోంది. ఈ విపత్తుల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 88 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 35 మంది గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,300కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రానికి దాదాపు రూ.1500 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా. రోడ్లు, విద్యుత్ లైన్లు వంటి కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

హిమాచల్‌లో విపత్తుల తీవ్రత పెరగడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అడ్డూఅదుపూ లేని పట్టణీకరణ, విచక్షణారహితంగా అడవుల నరికివేత, పటిష్ఠ‌మైన ప్రణాళికలు లేకుండా చేపడుతున్న నిర్మాణాల వల్లే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, విపత్తుల ప్రభావం అధికమవుతోందని వారు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని, సుస్థిర అభివృద్ధి ప్రణాళికలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికైనా మేల్కొని సరైన చర్యలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ పర్యావరణ స్థిరత్వానికే కాకుండా, అక్కడి ప్రజల భద్రత, జీవనోపాధికి కూడా ముప్పు తప్పదని హెచ్చ‌రించింది.
Supreme Court of India
Himachal Pradesh
environmental crisis
climate change
floods
landslides
environmental destruction
urbanization
deforestation
disaster management

More Telugu News