Tesla: టెస్లాకు రూ.2,100 కోట్ల భారీ జరిమానా .. ఎందుకంటే..!

Tesla Fined 242 Million in Florida Autopilot Crash Case
  • టెస్లా ఆటో పైలట్ వ్యవస్థ తప్పిదంతో ప్రమాదం
  • ప్రమాదంలో ఓ మహిళ మృతి, మరో వ్యక్తికి గాయాలు
  • బాధిత కుటుంబానికి భారీ జరిమానా చెల్లింపుకు ఫ్లోరిడా కోర్టు ఆదేశం
అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ లోపం వల్లే ప్రమాదం జరిగిందని ఫ్లోరిడా కోర్టు తేల్చింది. దీంతో బాధిత కుటుంబానికి 242 మిలియన్ డాలర్ల పరిహారం (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.2,100 కోట్లు) చెల్లించాలని సదరు కంపెనీని కోర్టు ఆదేశించింది.

కేసు వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని కీ లార్గోలో 2019లో ఈ ఘటన జరిగింది. జార్జ్ మెక్ గీ అనే వ్యక్తి తన టెస్లా కారులో వెళుతూ అత్యాధునిక ఆటో పైలట్ ఫీచర్‌ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ. మార్గమద్యంలో జార్జ్ మొబైల్ కారులో కింద పడిపోయింది. కారు ఆటో పైలట్ మోడ్‌లోనే ఉందని భావించిన జార్జ్ కిందకు వంగి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే ఆ సమయంలో కారు అదుపు తప్పి పక్కనే పార్క్ చేసి ఉన్న మరో కారును ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెల్లడించింది.

ఈ ప్రమాదానికి నష్టపరిహారంగా బాధిత కుటుంబాలకు మొత్తం 329 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే ప్రమాదానికి ఆటో పైలట్ వ్యవస్థ లోపం కూడా ఒక కారణమని గుర్తించిన న్యాయస్థానం.. ఇందుగానూ 242 మిలియన్ డాలర్లు టెస్లా కంపెనీ చెల్లించాలని ఆదేశించింది. మిగతా మొత్తం సదరు వాహన డ్రైవర్ చెల్లించాలని స్పష్టం చేసింది.

అయితే ఫ్లోరిడా కోర్టు తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు టెస్లా వెల్లడించింది. 
Tesla
Tesla fine
Tesla accident
Florida court
auto pilot
electric vehicle
car crash
George McGee
Key Largo
automated driving system

More Telugu News