Mohammed Siraj: ఓవల్ టెస్టు... ఇంగ్లండ్ లైనప్ ను కకావికలం చేసిన సిరాజ్, ప్రసిద్ధ్

Mohammed Siraj and Prasidh Krishna Wreak Havoc on England Lineup
  • ఓవల్ టెస్టులో బౌలర్లతో పుంజుకున్న టీమిండియా
  • తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్
  • భారత్‌పై 23 పరుగుల నామమాత్రపు ఆధిక్యం
  • చెరో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
  • ఇంగ్లండ్ తరఫున క్రాలీ, బ్రూక్ హాఫ్ సెంచరీలు
  • రసవత్తరంగా మారిన ఐదో టెస్ట్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌పై కేవలం 23 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే సాధించింది. ఒక దశలో భారీ ఆధిక్యం దిశగా సాగిన ఇంగ్లండ్, భారత బౌలర్ల ధాటికి అనూహ్యంగా కుప్పకూలింది.

శుక్రవారం రెండో రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ దూకుడుగా ప్రారంభమైంది. ఓపెనర్లు కేవలం 12.4 ఓవర్లలోనే 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్ జాక్ క్రాలీ (64) హాఫ్ సెంచరీతో రాణించడంతో లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 109 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించి, భారత్‌పై పెద్ద ఆధిక్యం సంపాదిస్తుందని అంతా భావించారు.

అయితే లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా సిరాజ్ (4/86) తన పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (4/62) కూడా తోడవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆతిథ్య జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో హ్యారీ బ్రూక్ (53) వేగంగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వర్షం కారణంగా కాసేపు ఆటకు అంతరాయం కలిగినా, తిరిగి ప్రారంభమయ్యాక సిరాజ్... హ్యారీ బ్రూక్‌ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 26, కేఎల్ రాహుల్ 7 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ పై టీమిండియా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Mohammed Siraj
Siraj
Prasidh Krishna
India vs England
Oval Test
England batting collapse
Harry Brook
Jasprit Bumrah
Cricket
Test Match

More Telugu News