Revanth Reddy: జర్నలిజం ముసుగులో అరాచకం.. వేరుచేయాల్సిన అవసరం ఉంది: సీఎం

Telangana CM Revanth Reddy comments on declining journalist credibility
  • క్షీణిస్తున్న జర్నలిస్టుల విశ్వసనీయతపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన
  • నిజమైన జర్నలిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపు
  • 'నవ తెలంగాణ'కు కమర్షియల్ పత్రికలతో సమానంగా ప్రకటనలు ఇస్తామని హామీ
  • జర్నలిజం ముసుగులో కొందరు దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
  • ప్రభుత్వ పనితీరుపై విమర్శలను స్వీకరిస్తామని, తప్పులు సరిదిద్దుకుంటామని వెల్లడి
ప్రస్తుతం రాజకీయ నాయకుల విశ్వసనీయత ఎంత వేగంగా పడిపోతోందో, జర్నలిస్టుల విశ్వసనీయత కూడా అదే స్థాయిలో పడిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు సొంతంగా పత్రికలు, ప్రసార సాధనాలు ఏర్పాటు చేసుకోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'నవ తెలంగాణ' దినపత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నిజమైన జర్నలిస్టులు ఇకనైనా ఒక లక్ష్మణరేఖ గీసుకోవాలని, జర్నలిజం ముసుగులో అరాచకం సృష్టిస్తున్న వారిని వేరుచేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గతంలో జర్నలిస్టులను ఎంతో గౌరవించేవాళ్లం. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ఎంతో హోంవర్క్ చేసి మాట్లాడేవాళ్లం. కానీ నేటి వింత పోకడల వల్ల ఆ పరిస్థితి మారింది. కొందరు సోషల్ మీడియా ముసుగులో పాకిస్థాన్ ఏజెంట్లుగా పనిచేస్తూ దేశ భద్రతకే ప్రమాదకరంగా మారుతున్నారు" అని హెచ్చరించారు. ఇలాంటి చర్యలను అరికట్టకపోతే సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.

ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేసే పత్రికలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. "మసాలా వార్తలు, గాసిప్‌లు రాసే వాణిజ్య పత్రికలకు దీటుగా 'నవ తెలంగాణ' పత్రికకు కూడా ప్రభుత్వ ప్రకటనలు సమానంగా ఇవ్వాలి" అని అక్కడే ఉన్న మంత్రికి ఆయన సూచించారు. ప్రజాపక్షం వహించే మీడియా సంస్థలను బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టుల పాత్రను ఆయన ఉప్పుతో పోల్చారు. "ఏ వంటకంలో ఎన్ని మసాలాలు వేసినా ఉప్పు లేకపోతే రుచి రాదు. అలాగే ప్రజా సమస్యలపై ఎర్రజెండా గొంతు వినిపించినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది" అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే మైకులో చెప్పాలని, తప్పులు చేస్తే చెవిలో చెప్పకపోయినా పర్వాలేదని, పత్రికల్లో రాస్తే వాటిని స్వీకరించి సరిదిద్దుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

Revanth Reddy
Telangana CM
Journalism
Media ethics
Fake news
Nav Telangana newspaper
Political parties
Social media
Public issues
Communist party

More Telugu News