Chandrababu Naidu: మహిళను బూతులు తిడితే మందలించాల్సింది పోయి ఇంకా తిట్టమని ప్రోత్సహిస్తున్నాడు: జగన్ పై చంద్రబాబు ఫైర్

Chandrababu Fires on Jagan Over Abusing Women
  • జమ్మలమడుగు నియోజకవర్గంలో చంద్రబాబు ప్రజావేదిక 
  • జగన్ సొంత మీడియాను అడ్డుపెట్టుకుని మోసగిస్తున్నాడంటూ ఆగ్రహం
  • సాక్షి మీడియాను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని వ్యాఖ్యలు
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఘరానా మోసగాడని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. సొంత మీడియా సంస్థలైన సాక్షి పత్రిక, సాక్షి టీవీలను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సాక్షి మీడియాను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని ఆయన హెచ్చరించారు. శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వారిని మందలించాల్సింది పోయి, ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడమని ప్రోత్సహించడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు అన్నారు. పార్టీ అధినేతగా జగన్ తన పార్టీ నాయకులను, కార్యకర్తలను క్రమశిక్షణలో ఉంచాలని సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణం విషయంలోనూ వైసీపీ దుష్ప్రచారం చేసిందని ఆయన గుర్తుచేశారు. మొదట గుండెపోటు అని సాక్షిలో రాసి, తర్వాత గొడ్డలిపోటు అని తేలిందని వివరించారు. తన చేతిలో కత్తి పెట్టి తానే చంపించానని కూడా రాశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

నిన్న బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలను నెల్లూరు పర్యటన దృశ్యాలతో కలిపి భారీగా జనం వచ్చినట్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసి, అసౌకర్యం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

నేతన్నలకు శుభవార్త 

చేనేతలకు చేయూతనిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు నిర్ణయాన్ని వెల్లడించారు. శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు. పవర్ లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈనెల 7వ తేదీన అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. 

చెడగొట్టడం తేలిక... నిలబెట్టడమే కష్టం

దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక...నిలబెట్టడమే చాలా కష్టం. విధ్వంసం చేయడం నిమిషం పని. గత ఐదేళ్లు అదే జరిగింది. కేంద్రం ప్రాయోజిత పథకాలు నిలిపేశారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మే నెలలో జరిగిన మహానాడు వేదికగా కడప స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెడతామని చెప్పాం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ సంస్థ ముందుకొచ్చింది. రూ.4,500 కోట్లతో తొలి దశ, రూ.11,850 కోట్లతో రెండో దశ పనులు చేపడుతుంది. 2029 కల్లా ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఈ ప్రాజెక్టు వస్తే జమ్మలమడుగుతో పాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం. సాస్కి పథకం కింద రూ.80 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ పనులు చేపడుతోంది. అందమైన లోయలున్న గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. 

సీమ పారిశ్రామికాభివృద్ధికి రోడ్ మ్యాప్

పారిశ్రామికంగా సీమ అభివృద్ది కోసం పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ తయారుచేశాం. సాగుకు ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఆటోమొబైల్, స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఈ ప్రాంతంలో నెలకొల్పేలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఓర్వకల్లు-లేపాక్షి మధ్య ఎలక్ట్రానిక్, డిఫెన్స్, ఏరో స్పేస్ పరిశ్రమలను తెస్తాం. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌ల కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కర్నూలు, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ వస్తే దేశానికి కావాల్సిన డ్రోన్స్ అన్నీ ఇక్కడే తయారవుతాయి.

రేపే అన్నదాత సుఖీభవ

‘2024 ఎన్నికల్లో ప్రజలు అద్భుత విజయం అందించారు. సుపరిపాలనలో తొలిఅడుగు వేశాం. కేంద్ర సాయంతో కలిపి ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టే రేపు అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ డబ్బు జమ చేస్తాం. కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో రైతుకు రూ.5 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. గత ప్రభుత్వం రూ.12,500 ఇస్తామని రూ.7,500 ఇచ్చింది. మన ప్రభుత్వం దాన్ని రూ. 14,000 వేలకు పెంచింది. ఏది రైతు ప్రభుత్వమో, ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వమో ప్రజలే నిర్ణయించుకోవాలి.






Chandrababu Naidu
Jagan Mohan Reddy
YSRCP
TDP
Andhra Pradesh Politics
Kadapa
Jammalamadugu
Free Electricity Scheme
Weavers
AP Elections 2024

More Telugu News