Donald Trump: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్ కంటే అమెరికాకే అధిక నష్టం.. ఒక్కో కుటుంబంపై రూ. 2 లక్షల భారం

Donald Trump Tariff Impact More on US Than India
  • ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికా ప్రజల పైనే ఎక్కువగా ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక
  • ఒక్కో కుటుంబంపై ఏడాదికి సగటున 2,400 డాలర్ల భారం పడుతుందని అంచనా
  • అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి
భారత్ సహా దాదాపు 70 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయా దేశాలపై భారీ సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం అమెరికా ప్రజల పైనే ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్భణం పెరిగి అక్కడి కుటుంబాలకు భారంగా మారనుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఒక్కో కుటుంబంపై 2,400 డాలర్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2 లక్షలు.

ట్రంప్ సుంకాల ప్రభావం ఆయా ఆదాయ వర్గాలపై భిన్నంగా ఉండవచ్చని పేర్కొంది. అల్పాదాయ కుటుంబాలపై 130 డాలర్లు, అధిక ఆదాయ కుటుంబాలపై 5 వేల డాలర్ల వరకు భారం పడుతుందని అంచనా వేసింది. సగటున ఇది 2,400 డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేసింది.

ట్రంప్ అధిక సుంకాల నిర్ణయం భారత్ సహా ఇతర దేశాల కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. ఖర్చులు పెరిగి, డిమాండ్ తగ్గుతుందని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికా జీడీపీ వృద్ధి 40 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

సుంకాల పెరుగుదలతో అమెరికాతో పాటు భారత్‌ కూడా సవాళ్లను ఎదుర్కొంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అయితే, సుంకాల ప్రభావంతో డాలర్ క్షీణించే అవకాశం ఉంటుందని, ద్రవ్యోల్భణం పెరగవచ్చని... వీటిని పరిగణనలోకి తీసుకుంటే భారత్ కంటే అమెరికానే బలహీనస్థితిలోకి వెళుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగానే ఉందని పేర్కొంది.
Donald Trump
Trump tariffs
US tariffs
India US trade
US economy
Inflation
SBI Research
Trade war

More Telugu News