Priyanka Chaturvedi: భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడిన ఎంపీ ప్రియాంక చతుర్వేది

Priyanka Chaturvedi Slams Trumps Comments on Indian Economy
  • ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి, అభ్యంతరకరమైనవన్న ప్రియాంక
  • అజ్ఞానం, అహంకారంతో కూడిన వ్యాఖ్యలు అని ట్రంప్‌పై మండిపాటు
  • సవాళ్లు ఉన్నాయి కానీ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం సరికాదన్న ప్రియాంక చతుర్వేది
  • ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థించడాన్ని చూడలేదన్న ప్రియాంక
భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది తప్పుబట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని తీవ్రంగా విమర్శించారు. "ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, ఆమోదయోగ్యం కానివి, అభ్యంతరకరమైనవి" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏమిటని ఆమె ప్రశ్నించారు.

ప్రియాంక చతుర్వేది ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ, ట్రంప్‌ వ్యాఖ్యలు అజ్ఞానం, అహంకారంతో కూడినవని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్య చర్చలకు ముందు మన దేశంపై ఒత్తిడి తేవడానికేనని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని ఆమె అన్నారు. భారత్ ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని ఆమె గుర్తు చేశారు.

తలసరి ఆదాయం నుంచి నిరుద్యోగం వరకు, చిన్న వ్యాపారాల నుంచి రైతుల వరకు అన్ని రంగాల్లో సవాళ్లు ఉండవచ్చని, కానీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆమె అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. దౌత్యపరంగా ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.

భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను విధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇది సరైన నిర్ణయం కాదని ఆమె అన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నందుకు అధిక టారిఫ్, జరిమానా విధించడం దురదృష్టకరమని అన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థించారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, తాను ఆ వ్యాఖ్యలను చూడలేదని ప్రియాంక చతుర్వేది అన్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం అవాస్తవమని, ఆమోదయోగ్యం కానివని ఆమె తేల్చి చెప్పారు.
Priyanka Chaturvedi
Donald Trump
Indian Economy
US India Trade
Uddhav Thackeray

More Telugu News