Supreme Court: మోహ‌న్ బాబు, మంచు విష్ణుల‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట‌

Mohan Babu Manchu Vishnu Get Relief in Supreme Court
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌ కోసం మోహ‌న్ బాబు, మంచు విష్ణు నిర‌స‌న‌
  • అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉండడంతో వారిపై కేసు న‌మోదు
  • త‌మ‌పై కేసు కొట్టివేయాల‌నే వారి అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చిన హైకోర్టు
  • దాంతో మోహన్ బాబు ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైనం
  • వారిపై రాష్ట్ర ప్ర‌భుత్వం న‌మోదు చేసిన కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌ కోసం గ‌తంలో ధ‌ర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్ర‌భుత్వం న‌మోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2019లో ఎన్నికల కోడ్ కేసులో తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థ శ్రీవిద్యానికేత‌న్‌లోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌ కోసం 2019 మార్చి 22న సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ఆందోళన నిర్వహించారు. దాంతో తండ్రీకొడుకులపై కేసు నమోదయింది. 

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలంటూ మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ సహా శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సిబ్బంది నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ నిరసనలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు కూడా చేశారు.

అయితే, అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉండగా, అప్పటి ఎన్నికల అధికారి హేమలతకు ఫిర్యాదు అందింది. మోహన్ బాబు, విష్ణు తదితరుల ఆందోళనతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింద‌ని ఆరోపిస్తూ, పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనతో పాటు తన కుమారుడిపై నమోదైన కేసును రద్దు చేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మోహన్ బాబు చేసిన అభ్యర్థనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. 

దాంతో మోహన్ బాబు ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, మోహన్ బాబు, ఆయన కుమారుడు దాఖలు చేసిన అభ్యర్థనను సమర్థించింది. మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడిపై చేసిన అభియోగాలు సరిపోవని స్పష్టం చేస్తూ.. చంద్ర‌గిరి పీఎస్‌లో 2019లో మార్చి 23న మోహన్ బాబు, ఆయన కుమారుడిపై నమోదైన కేసును కొట్టివేసింది. ఎఫ్ఐఆర్‌, ఛార్జ్‌షీట్ల‌ను క‌లిపి చ‌దివిన త‌ర్వాత అందులో పేర్కొన్న సెక్ష‌న్లు వీరికి ఎలా వ‌ర్తిస్తాయో అర్థం కావ‌డం లేద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.  
Supreme Court
Mohan Babu
Manchu Vishnu
Fee reimbursement
Andhra Pradesh
Sree Vidyaniketan
Election code
Protest
AP Government
Chandragiri

More Telugu News