C Mahesh: భారీ క్యూని పట్టించుకోకుండా ఫోన్ కాల్‌లో మునిగిపోయిన టికెట్ క్లర్క్‌పై వేటు.. వీడియో ఇదిగో!

Karnataka Railway Clerk Suspended for Ignoring Passengers
  • కర్ణాటకలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఘటన
  • భారీ క్యూ ఉన్న ఫోన్ మాట్లాడుతూ కూర్చున్న టికెట్ క్లర్క్
  •  సోషల్ మీడియాలో విమర్శలు
  • వేటేసిన ఉన్నతాధికారులు
కర్ణాటకలోని ఓ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న టికెట్ క్లర్క్ ఒకరు డ్యూటీలో ఉండగా ఫోన్ కాల్‌లో లీనమైపోయాడు. ప్రయాణికుల భారీ క్యూను పట్టించుకోకుండా, వారు మొత్తుకుంటున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో నిన్న అతడిని సస్పెండ్ చేశారు. 

వైరల్ అయిన వీడియోలో ప్రయాణికులు టికెట్ల కోసం బారులు తీరి ఉన్నప్పటికీ టికెట్ కౌంటర్‌లో కూర్చున్న సి. మహేశ్ నిర్లక్ష్యంగా ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించాడు. క్యూలోని ప్రయాణికులు పలుమార్లు టికెట్ల కోసం అభ్యర్థించినా, అతడు తన సంభాషణను కొనసాగించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కోపంతో ఒక ప్రయాణికుడు మహేశ్‌ను నిలదీయగా ‘ఒక్క నిమిషం’అని చెప్పి దాదాపు 15 నిమిషాలపాటు ఫోన్‌లోనే మాట్లాడాడని ఆ ప్రయాణికుడు ఆరోపించాడు.

ఇంకెంతసేపని ఓ ప్రయాణికుడు ప్రశ్నించగా క్లర్క్ ఫోన్‌లో మాట్లాడుతూనే వేచి ఉండమని సూచించాడు. క్యూలో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేశారు. చివరకు ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్లర్క్ ఫోన్ కాల్ ముగించి టికెట్లు జారీ చేయడం ప్రారంభించాడు.

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
ఈ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు దీనిని ‘సిగ్గుచేటు’అని అభివర్ణించారు. రైల్వే సిబ్బంది అనేక స్టేషన్లలో ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జవాబుదారీతనం కోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కొందరు డిమాండ్ చేశారు. రైల్వే ఉద్యోగుల పనిభారాన్ని కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, టికెట్లు జారీ చేయడం వంటి ప్రాథమిక బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు.

వేటేసిన అధికారులు
ఈ వివాదంపై స్పందించిన రైల్‌సేవా సంస్థ మహేశ్‌ను సస్పెండ్ చేసింది. ఓ ప్రయాణికుడు ఈ వీడియోను స్టేషన్ మాస్టర్‌కు పంపడంతో గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహేశ్‌ను డ్యూటీ నుంచి తొలగించినట్టు స్టేషన్ మేనేజర్ భగీరథ్ మీనా ధ్రువీకరించారు. 
C Mahesh
railway ticket clerk
Karnataka
railway station
ticket counter
passenger queue
suspension
negligence
Guntakal Railway Division
Bhageerath Meena

More Telugu News