TTD: శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసిన టీటీడీ

TTD Changes Srivari Darshan Rules for Srivani Trust Tickets
  • ఇప్పటివరకు శ్రీవాణి టికెట్ పై దర్శనం కోసం మూడ్రోజుల సమయం
  • కొత్త విధానంలో ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనం
  • ఆగస్టు 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా పరిశీలన 
  • నవంబరు 1 నుంచి పూర్తి స్తాయిలో అమలు
శ్రీవాణి దర్శన టికెట్లతో తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ కొత్త విధానం ప్రకారం, ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లతో వచ్చే భక్తులు, తాము వచ్చిన రోజునే శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటును పొందనున్నారు. ఈ విధానం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం నాడు తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో శ్రీవాణి దర్శనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రస్తుత విధానం: ఇప్పటి వరకు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారు మూడు రోజుల సమయం పడుతోంది.

నూతన విధానం: ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లు వచ్చిన రోజునే జారీ చేస్తారు... అదే రోజు దర్శనం కల్పిస్తారు.

టికెట్ జారీ: తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచి కోటా ఉన్నంత వరకు 200 టికెట్లు జారీ చేయబడతాయి.

దర్శన సమయం: ఆఫ్‌లైన్ టికెట్లతో వచ్చే భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద రిపోర్ట్ చేయాలి.

ఆన్‌లైన్ టికెట్లు: అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకు దర్శనం అనుమతించబడుతుంది. నవంబర్ 1 నుంచి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ టికెట్ భక్తులను సాయంత్రం 4:30 గంటలకు దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా అనుమతిస్తారు.

ఈ నూతన విధానం ద్వారా భక్తులు తమ దర్శన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని, వచ్చిన రోజునే శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం పొందుతారని టీటీడీ తెలిపింది. భక్తులు ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్ జారీ కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు.
TTD
Srivani Trust
Tirumala
Srivari Darshan
TTD New Rules
Tirupati
Venkataiah Chowdary
Offline Tickets
Online Tickets
Vaikuntam Queue Complex

More Telugu News