L Murugan: విచ్చలవిడిగా అభ్యంతరకర వీడియోలు.. 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

L Murugan Center bans 43 OTT platforms for objectionable content
  • లోక్‌సభకు తెలిపిన కేంద్ర మంత్రి మురుగన్
  • ఓటీటీ వేదికలు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్రసారం చేయరాదని స్పష్టీకరణ
  • ప్రసారం చేసే కంటెంట్‌ను వయస్సు ఆధారంగా వర్గీకరించాలన్న మంత్రి
అశ్లీలత, అనైతికత, హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న పలు ఓటీటీ వేదికలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవల 24 యాప్‌లు, వెబ్‌సైట్‌లపై నిషేధం విధించగా, ఇప్పటి వరకు 43 ఓటీటీ వేదికలను బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభకు తెలియజేశారు. ఓటీటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అభ్యంతరకర వీడియోలను నియంత్రించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

అశ్లీలత, హింస, సాంస్కృతిక అంశాలపై సున్నితమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు చట్టపరమైన, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే 43 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఓటీటీ వేదికలు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్రసారం చేయరాదని స్పష్టం చేశారు.

ప్రసారం చేసే కంటెంట్‌ను వయస్సు ఆధారంగా వర్గీకరించాలని మంత్రి సూచించారు. ఐటీ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారమే ఇది జరగాల్సి ఉందని ఆయన అన్నారు. పిల్లల వయస్సుకు తగని రీతిలో ఉన్న కంటెంట్‌ను నియంత్రించేందుకు తగిన రక్షణ చర్యలు, యాక్సెస్ నియంత్రణ చర్యలను అమలు చేయాలని ఓటీటీ వేదికలకు సూచించారు. సంబంధిత శాఖలతో సంప్రదింపుల అనంతరం చట్టాన్ని ఉల్లంఘించేలా ప్రసారం చేస్తున్న 43 ఓటీటీ కంటెంట్‌లను నిషేధించినట్లు ఆయన తెలిపారు.
L Murugan
OTT platforms
OTT ban
India OTT regulation
Obscene content
Pornography ban India

More Telugu News