Chandrababu Naidu: సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Returns to AP After Singapore Tour
  • ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన 
  • అవిశ్రాంతంగా సమావేశాలు, సదస్సులకు హాజరు 
  • మొత్తం 26 కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబు, లోకేశ్, ఇతర మంత్రులు, అధికారులు
పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరయ్యారు. పర్యటన మొదటి నుంచి చివరి రోజు వరకూ క్షణం తీరిక లేకుండా ఆసాంతం రాష్ట్ర అభివృద్ధి కాంక్షతో నిరంతరం చర్చలు, సంప్రదింపులు జరిపారు. 

సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాన మంత్రి, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్, అలాగే వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి టాన్ సీ లెంగ్, సెక్యూరిటీ, హోం వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం తదితరులతో సీఎం సమావేశమయ్యారు. ఏపీ-సింగపూర్ మధ్య సహకారాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధిలోనూ భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 

గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు వచ్చినట్టు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించి చెప్పారు. నవంబరు 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల్ని సీఎం ఆహ్వానించారు. సింగపూర్ లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే పర్యటన ఆసాంతం ముఖ్యమంత్రి బృందానికి సహాయ సహకారాలు అందించారు.

నిర్విరామంగా సమావేశాలు-సందర్శనలు

మరోవైపు సుర్బానా జురాంగ్, సెంబ్ కార్ప్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, ఏఐ సింగపూర్, కెప్పెల్ కార్పోరేషన్, జీఐసీ, ఎస్ఎంబీసీ, కాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, ఎవర్సెండై ఇంజనీరింగ్, టామ్ సెక్, విల్మర్, టీవీఎస్ మోటార్స్, మండై వైల్డ్ లైఫ్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలోని అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి సీఎం అవగాహన కల్పించారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోకి వచ్చే కంపెనీలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. 

పట్టణాభివృద్ధి, ఐటీ, ఏఐ, ఫినటెక్, మారిటైమ్, పోర్ట్స్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన వేర్వేరు రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇక్కడి వనరుల్ని వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామిక వేత్తలను కోరారు. దీంతో పాటు సింగపూర్ లోని ప్రతిష్టాత్మక హౌసింగ్ ప్రాజెక్టు బిడదారి ఎస్టేట్, జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్, టువాస్ పోర్టు, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను సీఎం బృందం సందర్శించింది. ఆయా ప్రాజెక్టుల్లో అమలు చేస్తోన్న అత్యుత్తమ, ఆధునిక విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని  నిర్ణయించింది.  

ఆకట్టుకున్న తెలుగు డయాస్పోరా
 
మొత్తం పర్యటనలో సింగపూర్ లో నిర్వహించిన 'తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా' సమావేశం విశేషంగా నిలిచింది. పర్యటన ఆరంభంలో సింగపూర్ తో పాటు సమీపంలోని ఐదు దేశాల నుంచి వచ్చిన తెలుగువారు ఆత్మీయ, అభిమానాలతో ముఖ్యమంత్రి బృందానికి ఘనస్వాగతం పలికారు. పర్యటన చివరి రోజైన బుధవారం కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అయ్యారు. సింగపూర్ నుంచి బయల్దేరిన సీఎం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే బయల్దేరి రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Singapore tour
investment meet
Nara Lokesh
AP development
Visakha summit
Singapore government
industrial policies
Amaravati

More Telugu News