Nara Lokesh: ఏపీలో జీసీసీ ఏర్పాటు చేయండి: ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థను కోరిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh requests ABeam Consulting to establish GCC in AP
  • సింగపూర్ లో పర్యటిస్తున్న చంద్రబాబు, నారా లోకేశ్, ఇతర మంత్రులు 
  • ఏబీమ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమోకాజుతో మంత్రి లోకేశ్ భేటీ
  • విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థను కోరారు. సింగపూర్‌లో ఏబీమ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమోకాజుతో మంత్రి లోకేశ్ బుధవారం నాడు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, విశాఖపట్నం ఐటీతో పాటు డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందని, జీసీసీ సెంటర్ల ఏర్పాటుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఇటీవలే ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థ విశాఖలో జీసీసీ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుందని గుర్తుచేశారు. జీసీసీలకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ విశాఖలో ఉందని, ఏబీమ్ కన్సల్టింగ్ అక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, వ్యయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ఏబీమ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలకు విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.

మంత్రి లోకేశ్ ప్రతిపాదనలకు ఏబీమ్ కన్సల్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమోకాజు సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ స్ట్రాటజీ, మేనేజ్‌మెంట్ ఐటీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, క్లౌడ్, సెక్యూరిటీ, అవుట్‌సోర్సింగ్ సేవలను అందిస్తుందని తెలిపారు. సింగపూర్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాంలో తమ సంస్థకు సుమారు 1,200 మంది నిపుణులైన కన్సల్టెంట్‌లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, శాప్ ఆధారిత సేవలను అందించడంపై దృష్టి సారిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని టోమోకాజు హామీ ఇచ్చారు.
Nara Lokesh
Andhra Pradesh
Global Capability Center
ABeam Consulting
Visakhapatnam
IT Development
Data City
Yano Tomokazu
Digital Transformation
AP IT Minister

More Telugu News