తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ సినిమానే 'పేచి'. రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2024 .. ఆగస్టులో థియేటర్లకు వచ్చింది. క్రితం ఏడాది సెప్టెంబర్ 20వ తేదీనే తమిళంలో ఓటీటీకి వచ్చింది. గాయత్రి .. బాలశరవణన్ .. ప్రీతి .. దేవ్ రామనాథ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఇప్పుడు ఇతర భాషలలోను అందుబాటులో ఉంది.

కథ: చరణ్ (దేవ్) మీనా (గాయత్రి) చారు ( ప్రీతి) సేతు (జానా) మాగేశ్వరన్ (జెర్రీ) ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఒక ఫారెస్టు ఏరియాను ఎంచుకుంటారు. అయితే ఆ అడవి లోపలికి వెళ్లడానికి ఫారెస్టు డిపార్టుమెంటువారి అనుమతి ఉండదు. ఇక ఆ అడవి సమీపంలో నివసించేవారు సైతం ఆ అడవిలోకి వెళ్లడాన్ని నిషేదిస్తారు. అందువలన ఈ స్నేహితులంతా ఆలోచనలో పడతారు. మారి (బాలశరవణన్) అనే ఒక లోకల్ 'గైడ్'తో మాట్లాడుకుంటారు. 

ఎవరికీ తెలియకుండా వాళ్లను అడవిలోకి తీసుకుని వెళ్లడానికి 'మారి' ఒప్పుకుంటాడు. అందరూ కలిసి అడవికి చేరుకుంటారు. ఆ అడవిలో నిషేదిత ప్రాంతం ఉందనీ, ఆ ప్రదేశం ఒక దుష్టశక్తి అధీనంలో ఉందని వాళ్లకి 'మారి' చెబుతాడు. ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్న జెర్రీ, సరదాగా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అయితే కెమెరాలో అతనికి వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. దాంతో సహజంగానే అతను భయపడుతూ ఉంటాడు. మిగతా వాళ్లంతా అతనిని హేళన చేస్తారు. 

ధైర్యం ఉన్నవాళ్లు నిషేదిత ప్రాంతంలోకి వెళితే తనకి భయమేనని ఒప్పుకుంటానని జెర్రీ అంటాడు. దాంతో సేతు - చారు ఇద్దరూ కూడా పందానికి సై అంటారు. 'పేచి' మామూలు దుష్టశక్తి కాదనీ,నిషేదిత ప్రాంతంలోకి వెళ్లొద్దని మారి ఎంతగానో చెబుతాడు. అయినా వినిపించుకోకుండా వాళ్లు 'పేచి' అధీనంలోని ప్రదేశంలో అడుగుపెడతారు. 'పేచి' ఎందుకు దుష్ట శక్తిగా మారుతుంది? అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ ఫారెస్టు నుంచి అంతా బయటపడతారా? అనేది కథ. 

విశ్లేషణ: ఒక దట్టమైన అడవి .. దానిని ఆనుకుని ఉన్న ఒక గ్రామం .. ఆ అడవిలో అసాధారణ శక్తుల కోసం ప్రయత్నించే ఒక మాంత్రికురాలు .. ఆమెను కట్టడి చేయడానికి పూర్వం జరిగిన ఒక తాంత్రిక ప్రక్రియ. ఇవేవీ తెలియకుండా ఆ ఫారెస్టులో ప్రవేశించిన కాలేజ్ స్టూడెంట్స్. ఇవన్నీ కూడా ఒక హారర్ థ్రిల్లర్ కథను బలంగా నడిపించే అంశాలే. అలాంటి అంశాలన్నింటికీ కలుపుకుంటూ ఆసక్తికరంగా నడిచిన కథ ఇది.

కథ .. స్క్రీన్ ప్లే .. టేకింగ్ ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఫస్టు సీన్ తోనే దర్శకుడు ఆడియన్స్ ను కథలోకి లాగేస్తాడు. ఆ తరువాత నుంచి చివరివరకూ, క్షణక్షణం .. భయం భయం అన్నట్టుగా కొనసాగుతుంది. ఫారెస్టులోకి అడుగుపెట్టిన వాళ్లంతా ప్రాణాలతో బయటపడితే బాగుండునని అనుకోని ఆడియన్స్ ఉండరు. అంతగా తెరపై పాత్రలను ప్రాణభయంతో పరుగులు తీయించడం జరుగుతుంది. 

సహజంగానే కాలేజ్ స్టూడెంట్స్ లో ఒక రకమైన ఉత్సాహం .. దూకుడు ఉంటాయి. అందువలన వాళ్లు పెద్దల మాటలను కొట్టిపారేయడం .. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ముందుకు వెళ్లి ప్రమాదంలో పడటం తిరుగుతూ ఉంటుంది. అలా చాలా సహజంగా పాత్రలను మలచిన విధానం మెప్పిస్తుంది. పరిశీలనగా ఈ సినిమాను చూస్తే, అసలైన పాత్రను అడవి పోషించిందనే విషయం మనకి అర్థమవుతుంది.

పనితీరు: సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ఒక పాడుబడిన బంగ్లాకి పరిమితమవుతూ ఉంటాయి. అలా కాకుండా ఒక దట్టమైన అడవిలో ఈ కథను దర్శకుడు సమర్థవంతంగా పరుగులు తీయించాడు. ఒకసారి ఈ కథలోకి ఎంటరైనవారు, పూర్తయ్యేవరకూ బయటికిరారు. అంతగా ఈ కథ భయపెడుతూనే ఆకట్టుకుంటుంది. 

కథ .. స్క్రీన్ ప్లే తరువాత ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచినవి ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం అని చెప్పాలి. దట్టమైన అడవిని తెరపై ఆవిష్కరించిన తీరు మనలను ఆ లొకేషన్స్ కి తీసుకుని వెళుతుంది. ఇక నేపథ్య సంగీతం మనలను ఆ పాత్రలతో పాటు అడవిలో పరిగెత్తిస్తుంది. ఎడిటింగ్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ముగింపు
: అడవి నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ ఇది. మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారికి ఒక పెర్ఫెక్ట్ కంటెంట్ ను చూసిన సంతృప్తి కలుగుతుంది.