Arshdeep Singh: చివరి టెస్టుకు భారత జట్టులో మార్పులు

Arshdeep Singh Likely to Play in Final Test Match
  • టీమ్ ఇండియాలో కీలక మార్పులకు కసరత్తు
  • ఇంగ్లాండ్ తో జరిగే ఐదో టెస్ట్ లో అరంగేట్రం చేయనున్న ఎడమ చేతి వాటం పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్
  • పేసర్ అన్షుల్ కాంబోజ్, ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ లకు తుది జట్టులో అనుమానమే
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను ఎలాగైనా డ్రా చేయాలని టీమ్ ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో జట్టు కూర్పులో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లండన్ చేరుకున్న జట్టు కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అర్ష్‌దీప్ సింగ్ ఐదో టెస్టులో రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం.

అర్ష్‌దీప్‌ను నాలుగో టెస్టులో ఆడించాలని తొలుత యాజమాన్యం భావించినప్పటికీ, అతడి ఎడమ చేతి బొటనవేలికి గాయం కావడంతో అది సాధ్యపడలేదు. తాజాగా నిన్న లండన్‌లోని ఓవల్ మైదానంలో అర్ష్‌దీప్ చురుగ్గా బౌలింగ్ చేస్తూ కనిపించడంతో గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో తుది జట్టులో అతడి పేరు దాదాపు ఖాయమైనట్టేనని భావిస్తున్నారు.

ఈ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఇప్పటివరకు 21 టెస్టులు ఆడి 66 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా భారత్ జట్టులో ఉన్న ఏకైక ఎడమ చేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ ఒక్కడే. కావున ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో అర్ష్‌దీప్ సఫలమవుతాడని జట్టు యాజమాన్యం ఆశాభావంతో ఉంది.

మాంచెస్టర్ టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన కొత్త పేసర్ అన్షుల్ కాంబోజ్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. అలానే ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు కూడా అనుమానమేనని సమాచారం. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన కారణంగా తర్వాతి రెండు మ్యాచ్‌లకు శార్దూల్‌ను జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది.

గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆకాశ్ దీప్ కూడా కోలుకున్నట్లు ప్రధాన కోచ్ గంభీర్ మాంచెస్టర్ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోకపోతే.. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్‌లను తుది జట్టులోకి తీసుకోవడం లాంఛనమేనని తెలుస్తోంది.

ఒకవేళ చివరి మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇస్తే మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న బుమ్రాను కీలక మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 
Arshdeep Singh
India vs England
India cricket team
Jasprit Bumrah
Indian team changes
5th Test
Anshul Kamboj
Shardul Thakur
Kuldeep Yadav
Aakash Deep

More Telugu News