Rajesh Vishwakarma: మానవతా సాయం చేస్తే ప్రతిఫలం ఇదా?

Rajesh Vishwakarma Faces Hardship After Wrongful Imprisonment
  • మహిళను మానవత్వంతో ఆసుపత్రిలో చేర్పించిన రాజేశ్ విశ్వకర్మ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి
  • రాజేశ్ కారణం అంటూ అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు
  • న్యాయవాది చొరవతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన వైనం
  • రాజేశ్‌ను నిర్దోషిగా విడుదల చేసిన న్యాయస్థానం
మంచి చేయబోతే చెడు ఎదురైందనే నానుడి ఈ ఘటనతో నిజమైంది. మానవత్వంతో తోటి మనిషికి సహాయం చేయబోయి ఓ వ్యక్తి చిక్కుల్లో పడిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. వైద్యులు, పోలీసుల తప్పిదం కారణంగా ఓ అమాయకుడు నేరస్తుడిగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన రాజేశ్ విశ్వకర్మ సాధారణ కూలీ. స్థానిక మురికివాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. గత సంవత్సరం జూన్ నెలలో తన పొరుగింటి మహిళ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించాడు.

అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో రాజేశ్ భయపడుతూ సమాధానాలు చెప్పడంతో అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. దీంతో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. తొమ్మిది రోజుల పాటు కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. రాజేశ్ పేదవాడు కావడంతో అతని తరపున వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు.

దీంతో న్యాయస్థానమే ఈ కేసును ప్రభుత్వ న్యాయవాదికి అప్పగించింది. ప్రభుత్వ న్యాయవాది బాధితుడిని విచారించగా, తాను తప్పేమీ చేయలేదని, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. మరోవైపు మెడికల్ రిపోర్టులోనూ ఆమె అనారోగ్యంతో మృతి చెందినట్లు ఉండటాన్ని న్యాయవాది గుర్తించాడు.

అయితే, పోస్టుమార్టం రిపోర్టులో గొంతు కోసి చంపినట్లు ఎలా వచ్చిందో అర్థం కాక న్యాయవాది పోలీసులను లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు, పోస్టుమార్టం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని న్యాయవాది గుర్తించాడు. ఇదే విషయాన్ని కోర్టులో ఆధారాలతో సహా నిరూపించాడు. దీంతో రాజేశ్‌ను కోర్టు నిర్దోషిగా పరిగణిస్తూ విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.

అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవనం దుర్భరంగా మారిందని రాజేశ్ వాపోయాడు. మానవత్వంతో సాయం చేయడానికి ముందుకు వెళితే చేయని నేరానికి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నాడు. జైలుకు వెళ్లి వచ్చానన్న కారణంతో ఎవరూ పని కూడా ఇవ్వడం లేదని, దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సహాయం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందా అని అతని కథ తెలిసిన వాళ్లు చర్చించుకుంటున్నారు. 
Rajesh Vishwakarma
Bhopal
Madhya Pradesh
wrongful arrest
humanitarian aid
police negligence
medical report
government lawyer
poverty
daily wage laborer

More Telugu News