Donald Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి.. 25 శాతం సుంకంపై ట్రంప్ బెదిరింపు!

India US Trade Deal Uncertainty Trump Threatens 25 Percent Tariff
  • ఆగస్టు 1తో ముగియనున్న గడువు
  • వచ్చే నెలలో భారత్‌ను సందర్శించనున్న అమెరికా బృందం
  • ఒప్పందం కుదరకుంటే 25 శాతం వరకు దిగుమంతి సుంకాలు విధించే అవకాశం
  • ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు లేని దేశాలపై 15 నుంచి 20 శాతం పన్ను
భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్పష్టం చేశారు. ఆగస్టు 1 గడువు ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పరస్పర సుంకాలు విధించే అవకాశం ఉందని చెప్పారు. భారత్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే ఒప్పందం కుదరకపోతే భారత్‌పై 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

"భారత్ 25 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. "భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు" అని పునరుద్ఘాటించారు. భారత్ తమ మిత్రదేశమేనని, తన అభ్యర్థన మేరకు పాకిస్థాన్‌తో యుద్ధం ముగించిందని ట్రంప్ పేర్కొన్నారు. 

గడువులోపు ఒప్పందం కుదరకపోతే భారత్ నుంచి కొన్ని ఎగుమతులపై 20 శాతం నుంచి 25 శాతం వరకు సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే, కొత్త రాయితీలపై తొందరపడకుండా, ఆగస్టు మధ్యలో అమెరికా బృందం సందర్శన సమయంలో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించాలని భారత్ యోచిస్తోంది.

సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యమని భారత అధికారులు తెలిపారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ, వ్యవసాయం, పాడి రంగాలు వివాదాస్పదంగా మిగిలాయి. సోయాబీన్, మొక్కజొన్న వంటి జన్యుపరంగా మార్పు చేసిన పంటల దిగుమతులను భారత్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. పాడి మార్కెట్‌ను తెరవడానికి సుముఖంగా లేదు.

ట్రంప్ గ్లోబల్ సుంకాల వ్యూహం
ట్రంప్ సోమవారం విస్తృత సుంకాల వ్యూహం గురించి సూచించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు లేని చాలా దేశాలు త్వరలో 15 శాతం నుంచి 20 శాతం వరకు అమెరికా సుంకాలను ఎదుర్కోవచ్చని, ఇది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 10 శాతం బేస్‌లైన్ సుంకం కంటే ఎక్కువని తెలిపారు. త్వరలో 200 దేశాలకు కొత్త ‘వరల్డ్ టారిఫ్’ రేటు గురించి అధికారికంగా తెలియజేయనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. 2024లో భారత్, అమెరికా మధ్య వాణిజ్యం సుమారు 129 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Donald Trump
India US trade deal
India trade
US trade
Import tariffs
Trade negotiations
US tariffs on India
India America trade
Global tariffs
Trade war

More Telugu News