Daya Nayak: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కు ప్రమోషన్!

Encounter Specialist Daya Nayak Receives Promotion
  • ఏసీపీగా పదోన్నతి పొందిన దయా నాయక్
  • 1990లో అండర్ వరల్డ్ గ్యాంగ్ సభ్యులను ఎన్‌కౌంటర్ చేయడంతో ప్రత్యేక గుర్తింపు 
  • పలు కీలక కేసుల దర్యాప్తు బృందంలోనూ అధికారిగా విధులు నిర్వహించిన దయా నాయక్ 
మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన దయా నాయక్‌కు ప్రభుత్వం ఏసీపీగా పదోన్నతి కల్పించింది. ఆయనతో పాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)లుగా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.

1990 దశకంలో ముంబయిలో అండర్ వరల్డ్ కార్యకలాపాలు తీవ్రంగా ఉండేవి. ఆ సమయంలో దయా నాయక్ దాదాపు 80 మంది గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం. ఆయన స్ఫూర్తితో గతంలో హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

దయా నాయక్ కర్ణాటకలోని ఉడిపిలో జన్మించినప్పటికీ బాల్యం ఎక్కువగా ముంబయిలోనే కొనసాగింది. అంథేరీలో డిగ్రీ పూర్తి చేసిన దయా నాయక్ 1995లో ముంబయిలో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరారు. ఆ సమయంలో నగరంలో అండర్ వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు జరిగేవి.

1996లో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని దయానాయక్ ఎన్‌కౌంటర్ చేయడంతో ఆయన పేరు ఒక్కసారిగా ఫేమస్ అయింది. అటు డిపార్ట్‌మెంట్‌లో, ఇటు ప్రజల్లోనూ దయా నాయక్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఇలా ప్రజల్లో, శాఖలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో దయా నాయక్ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయనకు క్లీన్ చిట్ రావడంతో మళ్లీ 2012లో తిరిగి విధుల్లోకి చేరారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లో కూడా పని చేశారు.

2021లో ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు, ఆ తర్వాత ఠాణె వ్యాపారవేత్త మన్ సుఖ్ హిరెన్ హత్య కేసుల దర్యాప్తు బృందంలోనూ దయా నాయక్ ఉన్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన దర్యాప్తు బృందంలో కూడా దయా నాయక్ పని చేశారు. 
Daya Nayak
Encounter Specialist
Mumbai Police
ACP Promotion
Maharashtra Police
Underworld Gangsters
Chota Rajan
Mumbai Crime
ATS
Mukesh Ambani

More Telugu News