Lawrence Melvin: బెంగళూరులో షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించిన గాళ్‌ఫ్రెండ్.. రూ. 2.5 కోట్ల డిమాండ్

Bengaluru Shocking Kidnap Drama Girlfriend Orchestrates Boyfriends Abduction
  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • దుబాయ్ నుంచి వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ను బయటకు వెళ్దామని పిలిపించి కిడ్నాప్
  • 8 రోజులపాటు చిత్రహింసలు
  • నలుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో గాళ్‌ఫ్రెండ్, మరో ముగ్గురు
డబ్బు కోసం గాళ్‌ఫ్రెండే తన బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించిన సంచలన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఈ డ్రామాలో దుబాయ్‌లో ట్రావెల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేసే లారెన్స్ మెల్విన్ బాధితుడిగా మారాడు. లారెన్స్ మెల్విన్ ఇటీవల తన స్వస్థలమైన బెంగళూరుకు వచ్చాడు. ఈ నెల 16 నుంచి అతను కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతడి తల్లి అశోక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లారెన్స్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు రూ.2.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది.

పోలీసుల దర్యాప్తులో ఈ కిడ్నాప్ వెనుక లారెన్స్ గాళ్‌ఫ్రెండ్ మహిమా కుట్ర ఉందని తేలింది. ఈ నెల 14న మహిమ "బయటకు వెళ్దాం" అని చెప్పడంతో లారెన్స్ ఆమెతో కలిసి కారు బుక్ చేసుకుని బయలుదేరాడు. కొంతదూరం వెళ్లాక డ్రైవర్ కారును దారి మళ్లించాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కారెక్కి లారెన్స్‌పై దాడి చేసి, అతడి వద్దనున్న రూ. 1 లక్ష నగదును లాక్కున్నారు. లారెన్స్‌ను ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించి, దాదాపు ఎనిమిది రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో, లారెన్స్ కుటుంబానికి ఫోన్ చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారు.

అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఒక మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. లారెన్స్‌ను సురక్షితంగా కాపాడారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రధాన కుట్రదారుగా గుర్తించిన మహిమతో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 
Lawrence Melvin
kidnap
Bengaluru
girlfriend
Mahima
ransom
crime
travel manager
police investigation

More Telugu News