Chandrababu Naidu: సముద్రాన్ని పూడ్చి నిర్మించిన జూరాంగ్ దీవిని సందర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Visits Jurong Island in Singapore
  • సింగపూర్ లో చంద్రబాబు బృందం పర్యటన
  • పెట్రోకెమికల్ ఐల్యాండ్‌ను సందర్శించిన చంద్రబాబు 
  • ఏపీలో పారిశ్రామిక-లాజిస్టిక్ కారిడార్‌ పై ప్రకటన
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక-లాజిస్టిక్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రతిష్ఠాత్మక జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్‌ను సందర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ పోర్టుల అనుసంధానంతో పాటు, వాటికి సమీపంలో ప్రపంచశ్రేణి చమురు రిఫైనరీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్‌లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు, ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి, మంత్రుల బృందం నిశితంగా పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన ఈ దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్, ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. 

సుర్బానా జురాంగ్ డిప్యూటీ డైరెక్టర్ టియో ఎంగ్ కియాట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీలీ ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికి జురాంగ్ పెట్రోకెమికల్ కేంద్రాన్ని, దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు చేసిన ప్రణాళికలు, వివిధ యుటిలిటీ మోడల్స్, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను, అలాగే ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ వంటి ఇతర ఉత్పత్తుల గురించి వివరించారు. దాదాపు 3 వేల హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హబ్‌ను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, సమీకృత భద్రతా వ్యవస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు గ్లోబల్ భాగస్వాములుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రితో పాటు జురాంగ్ పెట్రోకెమికల్ ఐల్యాండ్‌ను సందర్శించారు.

ఏపీ తీర ప్రాంతం: అభివృద్ధికి ముఖ ద్వారం, పెట్టుబడులకు గమ్యస్థానం

సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఏపీకి అతిపెద్ద వనరు అని నొక్కి చెప్పారు. మారిటైమ్ ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై సీఈఓలతో చర్చించారు. పోర్టుల నిర్మాణం, పోర్ట్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఆపరేటింగ్ పోర్టులు ఉన్నాయని, మరో నాలుగు కొత్త పోర్టులు రానున్నాయని వెల్లడించారు. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని, డ్రై పోర్టుల నిర్మాణం, ఇన్ ల్యాండ్ వాటర్‌వేస్ ద్వారా సరుకు రవాణా వంటి ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. టూరిజంకు పెద్ద పీట వేస్తున్నామని, క్రూయిజ్ టూరిజానికి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

సింగపూర్ దేశ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీ, సింగపూర్ ప్రభుత్వాలు కలిసి వివిధ రంగాల్లో పనిచేసే అంశంపై చర్చించారు. ఈ పర్యటనతో ఏపీలోని వివిధ రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేసేలా కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు ముఖ్యమంత్రి షణ్ముగరత్నంతో చెప్పారు.

నాలెడ్జ్ ఎకానమీ, మౌలిక సదుపాయాల కల్పన, సెమీకండక్టర్లు, అమరావతి అభివృద్ధి, అర్బన్ ప్లానింగ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లే అంశాలపై ఇరువురు నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. సింగపూర్ మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. భారత్-సింగపూర్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు తమ పర్యటన ఉపకరిస్తుందని అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Singapore
Jurong Island
Petrochemicals
Ports Development
Industrial Corridor
Investment Opportunities
Maritime Operations
Lee Hsien Loong

More Telugu News