Nandendla Manohar: ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ... ఎప్పట్నించి అంటే...!

Nandendla Manohar Announces Smart Ration Card Distribution in AP
  • ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
  • రాష్ట్రవ్యాప్తంగా 1,45,97,486 మంది రైస్ కార్డు లబ్ధిదారులు
  • కార్డులు ఉచితంగా పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల 
ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 1,45,97,486 మంది లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ పంపిణీ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో మంత్రుల ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి జరుగుతుందని మంత్రి వివరించారు.

కేవైసీ పూర్తిలో దేశంలోనే ప్రథమ స్థానం

రేషన్ కార్డుల కేవైసీ (KYC) పూర్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ 96.05 శాతం మేర పూర్తి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాలలోపు, 80 సంవత్సరాలు పైబడిన మొత్తం 11,47,132 మందికి కేవైసీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

రేషన్ కార్డు మార్పులు, చేర్పులు

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం 16,08,612 దరఖాస్తులు రాగా, వాటిలో 15,32,758 దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. కేవలం 4.72 శాతం దరఖాస్తులు మాత్రమే తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, మొత్తం లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కు చేరుకుందని చెప్పారు. వీరిలో 2,68,23,200 మందికి కేంద్ర ప్రభుత్వం, 1,61,56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486కు చేరుకుందన్నారు.

స్మార్ట్ కార్డుల ప్రత్యేకతలు

ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్డుల విధానాన్ని డిజిటలైజ్ చేసి, భద్రత, జవాబుదారితనం, పారదర్శకతతో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు తరహాలో ఈ స్మార్ట్ కార్డులను రూపొందించామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఈ కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా, కుటుంబ పెద్ద ఫోటోతో పాటు సభ్యుల పేర్లన్నీ పొందుపర్చడం జరిగిందన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్‌తో అనుసంధానం చేయబడిందని, తద్వారా ప్రతి లావాదేవీ సెంట్రల్ ఆఫీసులో వెంటనే నమోదు అవుతుందని వివరించారు.

రేషన్ పంపిణీ సమయాలు

ఈ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,796 రేషన్ షాపుల్లో ప్రతి నెలా 1 నుండి 15వ తేదీ వరకు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మరియు సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అయితే, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, ప్రభుత్వ పింఛన్లు పొందే దివ్యాంగులకు గత మూడు నెలల నుండి 26 నుండి 30వ తేదీ వరకు వారి ఇంటి వద్దే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని, స్వయంగా ఆ జిల్లాలో పర్యటించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని మంత్రి హామీ ఇచ్చారు.

దీపం-2 పథకం విజయవంతం

గత ఏడాది నవంబర్‌లో దీపావళి నుండి ప్రారంభించిన దీపం-2 పథకం విజయవంతంగా అమలు అవుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మొదటి విడతలో 97.59 లక్షల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసి, రూ.764 కోట్ల రాయితీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమైన రెండో విడతలో ఇప్పటి వరకు 93.46 లక్షల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసి, రూ.747 కోట్ల రాయితీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. మరో రూ.35 కోట్లు అడ్వాన్స్ గా ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నట్లు తెలిపారు. రెండో విడత కింద ఇంకా సిలిండర్లు పొందనివారంతా ఈ నెలాఖరులోపు పొందాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.


Nandendla Manohar
Andhra Pradesh
Smart Ration Cards
AP Ration Distribution
Ration Card KYC
AP Civil Supplies
Chandrababu Naidu
Pawan Kalyan
Deepam Scheme
Ration Shops

More Telugu News