Manish Tewari: ఆపరేషన్ సిందూర్ పై శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ

Manish Tewari Follows Shashi Tharoor on Operation Sindoor
  • లోక్ సభలో చర్చ సందర్భంగా మౌనం వీడని ఎంపీ మనీశ్ తివారి
  • పార్టీ గళం వినిపించలేదేమన్న ప్రశ్నకు దేశభక్తి గీతంతో జవాబు
  • ‘ఎక్స్’ ఖాతాలో దేశభక్తి గీతం పంచుకున్న మనీశ్ తివారి
పార్లమెంట్ లో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. లోక్ సభలో నిన్న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆపరేషన్ సిందూర్ లో మనవైపు జరిగిన నష్టాన్ని ప్రజలకు వెల్లడించాలని పట్టుబట్టారు. గౌరవ్ గొగోయ్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు సభలో ప్రభుత్వాన్ని నిలదీయగా.. పార్టీ ఎంపీ శశిథరూర్ మాత్రం మౌనం వహించారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో తాను గతంలో కేంద్రాన్ని మెచ్చుకున్నానని, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడలేనని కాంగ్రెస్ అధిష్ఠానానికి థరూర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో పార్లమెంట్ లో పార్టీ తరఫున మాట్లాడే ఎంపీల జాబితాలో థరూర్ పేరును కాంగ్రెస్ చేర్చలేదు. ఫలితంగా థరూర్ సభలో మౌనాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.

తాజాగా శశిథరూర్ బాటలోనే మరో ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారి కూడా ఆపరేషన్ సిందూర్ పై జరిగిన చర్చలో పాల్గొనలేదు. ఈ విషయంపై పార్లమెంట్ ఆవరణలో మీడియా సంధించిన ప్రశ్నలకు కూడా తివారి స్పందించలేదు. అయితే, తన మౌనానికి కారణం ఏంటనేది ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో దేశభక్తి గీతాన్ని పోస్ట్ చేశారు. భారతీయుడిగా భారత దేశ కీర్తిని చాటుతానని, దేశం కోసమే మాట్లాడతాననే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సుముఖంగా లేనని పరోక్షంగా వెల్లడించారు. ఈ కారణంతోనే మనోజ్ తివారిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చర్చలో పాల్గొనకుండా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Manish Tewari
Operation Sindoor
Shashi Tharoor
Gaurav Gogoi
Congress Party
Indian Parliament
X Post
National Security
Political Analysis
India

More Telugu News