Chandrababu Naidu: సింగపూర్ లో టువాస్ పోర్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Visits Tuas Port in Singapore
  • సింగపూర్ లో రెండో రోజు పర్యటన 
  • పలు కార్యక్రమాలతో చంద్రబాబు బిజీ 
  • సింగపూర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టువాస్ పోర్టు
  • పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో సీఎం చంద్రబాబు భేటీ
రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టువాస్ పోర్టును సందర్శించారు. ఆసియాలోనే రెండో అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. 

కాగా, ఏపీలో పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉందని.. తీర ప్రాంతం ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని  కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద టువాస్ పోర్టును సీఎం బృందం సందర్శించి అధ్యయనం చేసింది. 

టువాస్ పోర్టు సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోర్టు నిర్మాణం మొదలుకుని పోర్టు నిర్వహణ, కార్యకలాపాలు వంటి అంశాలపై టువాస్ పోర్టు అధికారులతో చంద్రబాబు బృందం చర్చించింది. పోర్టు కార్యకలాపాల నిర్వహణకు ఏఐ లాంటి సాంకేతిక అంశాలను ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై ఆరా తీసిన చంద్రబాబు.. టువాస్ పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సుతో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను పరిశీలించారు.

అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టు నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది... ఎన్ని విడతల్లో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నారనే అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా రూ. 1.70 లక్షల కోట్ల వ్యయంతో టువాస్ పోర్టు నిర్మాణం చేపడుతున్నట్టు పోర్టు అథారిటీ సీఈఓ విన్సెంట్ చెప్పారు. నాలుగు విడతలుగా పోర్టును నిర్మించాలని తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని విన్సెంట్ చెప్పారు.

ఏపీ పోర్టులకు సింగపూర్ సాంకేతికత

ఏపీలో ప్రతి 50 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఓ పోర్టు నిర్మించాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటోంది. పోర్టుల నిర్మాణం మొదలుకుని ఆయా పోర్టుల్లో ఆపరేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ తదితర అంశాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు ఎంతవరకు ఉపకరిస్తాయన్న అంశంపై సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం అధ్యయనం నిర్వహించింది. 

పోర్టు ఆధారిత పరిశ్రమలు, కార్యకలాపాలు నిర్వహణ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పోర్టు అథార్టీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఏపీ పోర్టులను సింగపూర్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశాలపై సింగపూర్ అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు జరిపింది. 

రియల్ టైమ్ కార్గో ట్రాకింగ్, గ్రీన్ పోర్టు డెవలప్మెంట్, పోర్టుల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సమగ్రమైన ప్రణాళికలు వంటి విషయాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలోని పోర్టుల ఆధునీకరణలో సింగపూర్ మోడల్ ను అనుసరించే అంశాన్ని కూడా సీఎం, మంత్రుల బృందం అధ్యయనం చేసింది. దీంట్లో భాగంగా సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యం, టెక్నాలజీ ట్రాన్సఫర్, జాయింట్ వెంచర్ల ఏర్పాటు వంటి విషయాలపై పోర్టు  ఆఫ్ సింగపూర్ అథారిటీ అధికారులతో సీఎం బృందం చర్చించింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు టువాస్ పోర్టును సందర్శించారు.
Chandrababu Naidu
Tuas Port
Singapore
Andhra Pradesh
AP Ports Development
Port Authority of Singapore
Nara Lokesh
TG Bharat
Artificial Intelligence
Logistics Hub

More Telugu News