Nara Lokesh: గిన్నిస్ బుక్ లో ఎక్కిన 'మెగా పీటీఎం'... టీచర్లకు అంకితం ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

Mega PTM Enters Guinness Book Minister Nara Lokesh Dedicates to Teachers
  • 53.4 లక్షల పేరెంట్స్, టీచర్స్ పాల్గొన్న అతిపెద్ద పీటీఎంగా రికార్డ్
  • విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో కలిపి మొత్తం 1.5 కోట్ల మంది హాజరు 
  • గిన్నిస్ రికార్డ్ సాధనలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి లోకేశ్ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్ (MEGA PTM) నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయుల‌కు అంకితం అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్ర‌క‌టించారు. గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగా పీటీఎంలో 5.34 మిలియన్ల (53.4 లక్షలు) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) సభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 15.2 మిలియన్ల (1.5 కోట్లు) మంది ఈ అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగులో భాగ‌మ‌య్యారు.

జాతీయ విద్యా విధానం ఐదవ వార్షికోత్సవం జూలై 29కి ఒక రోజు ముందు మెగా పేరెంట్ టీచ‌ర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించ‌డం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావడానికి  ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ రికార్డు గొప్ప ప్రోత్సాహంగా నిలిచిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు మెగా పీటీఎంని విజయవంతం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశార‌ని కొనియాడారు. ఈ అరుదైన రికార్డు సాధ‌న‌లో భాగ‌మైన‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విద్యా వికాసానికి, సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, విద్యాశాఖ చేస్తున్న కృషిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించడం హర్షనీయమన్నారు.

రికార్డు నమోదు ఇలా...

ఈ మెగా పీటీఎం నుంచి సేకరించిన డేటాను నిశితంగా ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డు అధికారికంగా గిన్నిస్ రికార్డు బృందం ధృవీకరించింది. ఇందులో మూడు ఫోటోగ్రాఫ్‌లు, ఒక వీడియో, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సంఖ్య మరియు ప్రతి పాల్గొన్న పాఠశాల నుంచి ఇండిపెండెంట్ విట్నెస్ ద్వారా డేటాను LEAP యాప్ ద్వారా సేకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు ఈ అవార్డును నిర్ధారించడానికి 61,000 పాఠశాలల నుండి సేకరించిన డేటాను విశ్లేషించారు. అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధృవపత్రం ఆగస్టు రెండవ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు.

ఈ అవార్డు ఎన‌లేని ప్రోత్సాహం- స‌మ‌గ్ర‌శిక్ష ప్రాజెక్టు డైరెక్ట‌ర్ బి శ్రీనివాస‌రావు

విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ గారి ఆలోచ‌న‌ల మేర‌కు తీసుకొస్తున్న‌ ఏపీ మోడ‌ల్ ఎడ్యుకేష‌న్ లో భాగంగా అందరికీ నాణ్యమైన, సమానమైన విద్యను అందించేందుకు ఒక య‌జ్ఞంలా ప‌నిచేస్తున్న‌ ప్ర‌భుత్వం, రాష్ట్ర విద్యా శాఖ, స‌మ‌గ్ర‌శిక్ష‌, ఉపాధ్యాయుల‌కు మెగా పీటీఎం నిర్వ‌హ‌ణ ద్వారా అందిన  గిన్నిస్ అవార్డు ఎన‌లేని ప్రోత్సాహంగా నిలుస్తుంద‌ని స‌మ‌గ్ర‌శిక్ష ప్రాజెక్టు డైరెక్ట‌ర్ బి శ్రీనివాస‌రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Nara Lokesh
Mega PTM
Andhra Pradesh
Guinness World Record
Parent Teacher Meeting
AP Education
B Srinivasa Rao
School Education
LEAP App
Education Policy

More Telugu News