Ben Stokes: ఆట చివర్లో బ్రూక్ తో బౌలింగ్ చేయించడంపై స్టోక్స్ వివరణ

Ben Stokes Explains Giving Bowling to Brook at End of Match
  • డ్రాగా ముగిసిన ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టు
  • అద్భుత పోరాటం కనబర్చిన టీమిండియా
  • చివర్లో నిర్లక్ష్యంగా బంతులు  విసిరిన బ్రూక్
  • టీమిండియా అభిమానుల ఆగ్రహం 
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అద్భుత పోరాటం అనదగ్గ రీతిలో ఓల్డ్ ట్రాఫర్డ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్వితీయమైన స్ఫూర్తి కనబర్చారు. తద్వారా, ఓటమి తప్పదనుకున్న టెస్టును డ్రాగా ముగించి, సిరీస్ సమం చేసే ఆశలను సజీవంగా నిలుపుకున్నారు. 

అయితే, నిన్న ఐదో రోజు ఆట చివర్లో టీమిండియా బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్  సెంచరీలకు చేరువలో ఉండగా... ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ ప్రధాన బౌలర్లను పక్కనబెట్టి హ్యారీ బ్రూక్ ను బౌలింగ్ కు దించడం విమర్శలకు దారితీసింది. దీనిపై స్టోక్స్ వివరణ ఇచ్చాడు. తమ జట్టుకు గెలుపు అవకాశాలు కనిపించినంత వరకు ప్రధాన బౌలర్లతోనే ఓవర్లు వేయించామని, ఇక డ్రా తప్పదని తేలినప్పుడు వారిపై ఇంకా భారం మోపడం సరికాదనిపించిందని అన్నాడు. అందుకే, పార్ట్ టైమ్ బౌలర్ బ్రూక్ కు బంతి ఇచ్చానని తెలిపాడు. 

ఇక, మ్యాచ్ ముగిసేందుకు మరో గంట సమయం ఉన్నప్పటికీ... జడేజా, సుందర్ లకు తాను షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నాన్ని కూడా స్టోక్స్ సమర్థించుకున్నాడు. ఇక మ్యాచ్ లో ఫలితం తేలే అవకాశం లేనప్పుడు డ్రా ప్రతిపాదనతో షేక్ హ్యాండ్ ఇవ్వడం సాధారణమైన విషయం అని అన్నాడు. కానీ తన ప్రతిపాదనకు అంగీకరించలేదని, దాంతో, తమ మెయిన్ బౌలర్లకు విశ్రాంతి ఇచ్చి బ్రూక్ తో బౌలింగ్ చేయించానని వివరించాడు. 

అయితే, బ్రూక్ ఎంతో నిర్లక్ష్యంగా స్లో ఫుల్ టాస్ లు వేయడం, కొట్టుకోండి అన్నట్టు బౌలింగ్ చేయడం భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దీనిపైనా స్టోక్స్ స్పందించాడు. బౌలింగ్ చేసేటప్పుడు చెత్త పనులు చేయొద్దు... కొత్తగా ఏమీ ట్రై చేయాల్సిన అవసరం లేదు అని బ్రూక్ కు చెప్పానని వెల్లడించాడు. 
Ben Stokes
England cricket
India cricket
Harry Brook
Ravindra Jadeja
Washington Sundar
Old Trafford
Test match
cricket series
draw

More Telugu News