Vijay Deverakonda: విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' లో కొత్త నటుడు.. ఎవరీ వెంకిటేశ్?

Vijay Deverakonda Kingdom Introduces New Actor Venkatesh VP
  • ఈ నెల 31న విడుదల కానున్న విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్
  • విలన్‌గా మలయాళ నటుడు వెంకిటేశ్ 
  • మలయాళ సినీ ఇండస్ట్రీలో 2014 నుంచి నటిస్తున్న వెంకిటేశ్ 
ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'కింగ్డమ్' ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం ద్వారా మలయాళం నుంచి మరో యువ నటుడు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో విలన్‌గా కనిపించిన ఈ మలయాళ నటుడు హైలైట్ అయ్యాడు. దీంతో ఇతను ఎవరు అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. అతని పేరు వెంకిటేశ్ వీపీ. ట్రైలర్‌లో రెండు షాట్లలోనే కనిపించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన వెంకిటేశ్ 2014 నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించాడు.

వెంకిటేశ్ 'ఒడియన్', 'వెలిపాడింటే పుస్తకం', 'తట్టుంపురత్ అచ్యుతన్' మొదలైన చిత్రాల్లో కనిపించాడు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' చిత్రంలో వెంకిటేశ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా ద్వారానే అతనికి 'కింగ్డమ్'లో అవకాశం వచ్చిందని సమాచారం. వెంకిటేశ్ రాకతో టాలీవుడ్‌కు మరో కొత్త విలన్ దొరికాడని అంటున్నారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ సంగీతం అందించగా, గౌతమ్ తిన్నసూరి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
Vijay Deverakonda
Kingdom Movie
Venkatesh VP
Bhagyashri Borse
Gautham Tinnanuri
Telugu cinema
Tollywood
Anirudh Ravichander
Naga Vamsi
Malayalam actor

More Telugu News