Madhya Pradesh: వార్షిక ఆదాయం రూ.3గా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ జారీ.. నెట్టింట రైతు ఆదాయ ధ్రువీకరణ పత్రం వైర‌ల్‌!

Clerical Error Turns Farmer Into Poorest In India With Rs 3 Annual Income
  • మధ్యప్రదేశ్‌లోని స‌త్నా జిల్లాలో ఘటన
  • రామ్‌ స్వరూప్ అనే రైతుకు వార్షిక ఆదాయం రూ.3గా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ జారీ
  • దీంతో అతడ్ని దేశంలోనే పేద రైతుగా అభివర్ణిస్తున్న నెటిజన్లు
  •  ‘క్లరికల్ ఎర్రర్’ వల్ల ఇలా జరిగిందని అధికారుల వివరణ 

ఒక రైతు వార్షిక ఆదాయం కేవలం రూ.3గా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ జారీ అయింది. ఈ మేరకు అధికారులు జారీ చేసిన ఈ ఆదాయ ధ్రువీకరణ పత్రం సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడ్ని దేశంలోనే పేద రైతుగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని స‌త్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కోఠి తహసీల్ పరిధిలోని నయాగావ్ గ్రామానికి చెందిన రామ్‌ స్వరూప్ అనే రైతు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడు. ఆయ‌న‌కు ఈ నెల 22న తహసీల్దార్ సౌరభ్ ద్వివేది సంతకంతో ఇన్‌కమ్‌ సర్జిఫికెట్‌ జారీ అయింది. అయితే, ఆ ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌లో రైతు వార్షిక ఆదాయాన్ని రూ.3గా పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం ఆయ‌న‌ నెలకు కేవ‌లం 25 పైసలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ ఆదాయ ధ్రువీకరణ పత్రం సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ‘మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాలనలో ఇండియాలో అత్యంత పేద వ్యక్తిని మేం కనుగొన్నాం. వార్షిక ఆదాయం కేవలం రూ.3, ఇది షాకింగ్ కాదా? ప్రజలను పేదలుగా మార్చే లక్ష్యం? ఎందుకంటే ఇప్పుడు కుర్చీ కూడా కమీషన్ తింటుంది’ అని ఆరోపించింది.

మరోవైపు ఈ ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌పై విమర్శలు రావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. ‘క్లరికల్ ఎర్రర్’ వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. కొత్త ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జులై 25న జారీ చేశారు. రామ్‌ స్వరూప్‌ వార్షిక ఆదాయం రూ.30,000గా అందులో పేర్కొన్నారు.
Madhya Pradesh
Ram Swaroop
Madhya Pradesh farmer
income certificate
Satna district
Naya Gaon
farmer income
clerical error
Mohan Yadav
Indian farmers
agriculture

More Telugu News