Kim Jong Un: వెయ్యి కార్లు కొనుగోలు చేసి 50 ఏళ్లు.. ఇప్పటికీ డబ్బు చెల్లించని నార్త్ కొరియా

North Korea fails to pay for 1000 Volvo cars after 50 years
  • 1974లో వెయ్యి వోల్వో కార్లకు ఆర్డర్
  • ఒప్పందం ప్రకారం కార్లు పంపిన స్వీడన్ కంపెనీ
  • డబ్బు చెల్లించకుండా ఇప్పటికీ ఆ కార్లను వాడుతున్న నార్త్ కొరియా
  • విదేశీ జర్నలిస్టులను ఈ కార్లను ఉపయోగిస్తున్న వైనం
ప్రంపంచం మొత్తం ఒకవైపు ఉంటే ఉత్తర కొరియా మాత్రం మరోవైపు ఉంటుంది. ప్రజలను ఇప్పటికీ పాతకాలంలోనే బతికేలా చేస్తుంటుంది. నియంతృత్వ పోకడలతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రజలను నియంత్రిస్తుంటాడనే విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసు. అలాంటి ఉత్తర కొరియాతో స్వీడన్ కంపెనీలు ఓ బిజినెస్ డీలింగ్ కుదుర్చుకున్నాయి. 1,000 వోల్వో కార్లను సప్లై చేసేందుకు అంగీకరించాయి. ఇది 1974 నాటి మాట. అప్పట్లో ఈ ఒప్పందాన్ని స్వీడన్ కంపెనీ చాలా గొప్పగా భావించింది. ఉత్తర కొరియాలో ఇక తమ కంపెనీ వేగంగా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం వెయ్యి కార్లను అనతికాలంలోనే ఎగుమతి చేసింది. అయితే, ఆ కార్లకు సంబంధించి పైసా కూడా ఉత్తర కొరియా చెల్లించలేదు.

ఈ కార్ల విలువ అప్పట్లోనే 73 మిలియన్ డాలర్లు. రేపో మాపో చెల్లిస్తుందని ఆ కంపెనీ ఈ రోజుకూ ఎదురుచూస్తూనే ఉంది కానీ 50 ఏళ్లు గడిచినా నేటికీ ఉత్తర కొరియా నుంచి ఒక్క డాలరు కూడా ముట్టలేదు. ఈ విషయంపై అంతర్జాతీయ మీడియాలోనూ పలుమార్లు కథనాలు ప్రసారమయ్యాయి. స్వీడన్ కంపెనీ పలుమార్లు లేఖలు రాసినా ఉపయోగం లేకుండా పోయింది. నాడు 73 మిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం ప్రస్తుతం వడ్డీతో కలిసి సుమారు 330 మిలియన్ డాలర్లకు చేరింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 50 ఏళ్ల నాటి వోల్వో కార్లను ఉత్తర కొరియా నేటికీ ఉపయోగిస్తూనే ఉంది. విదేశీ ప్రతినిధులు, జర్నలిస్టులు తమ దేశానికి వచ్చినపుడు వారిని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఈ వోల్వో కార్లనే ఉపయోగిస్తుండడం విశేషం.
Kim Jong Un
North Korea
Sweden
Volvo cars
North Korea debt
Sweden North Korea relations
Volvo
international trade
unpaid debt
business deal

More Telugu News