Abhishek Nayar: టీమిండియా మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్‌కు కీల‌క బాధ్య‌త‌లు

Abhishek Nayar appointed head coach of UP Warriorz ahead of wpl season 4
  • యూపీ వారియర్స్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా నాయర్ నియామ‌కం
  • ఆ జట్టుకు మూడు సీజన్లు కోచింగ్ ఇచ్చిన జాన్ లెవిస్‌
  • అత‌ని స్థానంలో నాయర్‌ను ఎంపిక చేసిన‌ యూపీ యాజమాన్యం
భారత పురుషుల జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్‌కు తాజాగా కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కాయి. మహిళల ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) ఫ్రాంచైజీ యూపీ వారియర్స్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా నాయర్ నియమితులయ్యాడు. ఆ జట్టుకు మూడు సీజన్లు కోచింగ్ ఇచ్చిన జాన్ లెవిస్‌ స్థానంలో నాయర్‌ను ఎంపిక చేసిన‌ట్టు శుక్రవారం యూపీ యాజమాన్యం ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదికగా వెల్లడించింది.

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)కు ఆపై భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించిన అభిషేక్ నాయర్ తమ జట్టు టైటిల్ కలను సాకారం చేస్తాడని యూపీ యాజమాన్యం నమ్ముతోంది. ఈ సంద‌ర్భంగా నాయ‌ర్ మాట్లాడుతూ... ‘యూపీ వారియర్స్‌తో రెండేళ్ల క్రితం పని చేశాను. బెంగళూరులో ఆ జట్లు ప్లేయర్లకు మెలకువలు చెప్పాను. కానీ, ఈసారి హెడ్‌కోచ్‌గా పెద్ద బాధ్యత అప్పగించారు. మహిళల క్రికెట్ అభివృద్ధికి డబ్ల్యూపీఎల్ చక్కని వేదిక. నాలుగో సీజన్‌లో యూపీ స్క్వాడ్‌ ప్రతిభావంతులతో నిండేలా చూస్తాను. ఇప్పటికే ఆ జట్టు పటిష్ఠంగానే ఉంది’ అని అన్నాడు. 

ఇక‌, గ‌తేడాది గౌతం గంభీర్‌ బృందంలో ఒకడిగా టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన నాయర్‌పై అనుకోకుండా వేటు పడిన విష‌యం తెలిసిందే. దాంతో అతడిని ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌కు కేకేఆర్ త‌మ కోచింగ్ స్టాఫ్‌లో చోటు క‌ల్పించింది. అయితే, 18వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. 

డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ ప్ర‌ద‌ర్శ‌న ఇలా 
డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్‌ జట్టు మూడు సీజ‌న్ల‌లో క‌లిపి 25 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో తొమ్మిది మాత్రమే గెలిచింది. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలిచేందుకు యూపీ పక్కాగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే టాలెంట్ స్కౌట్‌గా, వ్యూహకర్తగా అనుభవమున్న అభిషేక్ నాయ‌ర్‌ను యూపీ మేనేజ్‌మెంట్ హెడ్‌ కోచ్‌గా నియమించింది.


Abhishek Nayar
UP Warriorz
WPL
Womens Premier League
womens cricket
Kolkata Knight Riders
Gautam Gambhir
cricket coach
Indian cricket
sports news

More Telugu News