Shadnagar accident: ట్యాంకర్ టైర్ కింద పడి యువతి ఆర్తనాదాలు.. షాద్ నగర్ లో ప్రమాదం

Tanker Kills Father and Daughter in Shadnagar Road Accident
  • స్కూటీని ఢీ కొట్టిన ట్యాంకర్.. తీవ్రగాయాలతో తండ్రి మృతి
  • మృత్యువుతో పోరాడుతూ కాపాడాలని యువతి ఆర్తనాదాలు
  • ఆంబులెన్స్ వచ్చేలోగా ప్రాణాలు విడిచిన యువతి
స్కూటీపై వెళుతున్న తండ్రీకూతుళ్లను ఓ ట్యాంకర్ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. తండ్రి వెంటనే మరణించగా.. ట్యాంకర్ టైర్ కింద పడిన కూతురు రక్తమోడుతూ కాపాడాలని వేడుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఈ రోజు ఉదయం చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ కు చెందిన మచ్చేందర్ తన కూతురు మైత్రిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు స్కూటీపై బయలుదేరాడు. షాద్ నగర్ చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ వారి స్కూటీని ఢీకొట్టింది. దీంతో మచ్చేందర్ అక్కడికక్కడే మరణించారు. మైత్రి లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రగాయాలపాలైంది. మృత్యువుతో పోరాడుతూ.. 'అంకుల్ నన్ను కాపాడండి ప్లీజ్' అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. మైత్రి అతి కష్టమ్మీద తన మొబైల్ ను సమీపంలో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని కోరింది.

అదే సమయంలో.. స్నేహితురాలి నుంచి మైత్రికి ఫోన్ రావడంతో ప్రమాదం విషయం చెప్పి కుటుంబ సభ్యులకు సమచారం అందించాలని స్థానికులు కోరారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించేలోగా తీవ్ర రక్తస్రావం కారణంగా మైత్రి ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Shadnagar accident
Shadnagar
road accident
tanker accident
Rangareddy district
father daughter accident
Telangana news
accident news
fatal accident
road safety

More Telugu News