FIDE Womens World Cup: చెస్ వ‌ర‌ల్డ్ క‌ప్‌.. భార‌త ప్లేయ‌ర్ల మ‌ధ్య ఫైన‌ల్ పోరు

Koneru Humpy beats Chinas Lei Tingjie to set up Divya Deshmukh battle in FIDE Womens Chess World Cup
  • ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత ప్లేయర్లు 
  • ఇప్పటికే ఈ మెగాటోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత యువ ప్లేయర్‌ దివ్య
  • తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి తుదిపోరుకు అర్హత
  • సెమీస్‌లో చైనాకు చెందిన టింగ్జి లీపై హంపి 5-3 తేడాతో విజయం
  • ఈ నెల 26, 27 తేదీల్లో ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్న భార‌త ప్లేయ‌ర్లు
ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో భారత యువ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ఫైనల్లోకి అడుగుపెట్ట‌గా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో హంపి 5-3 తేడాతో చైనాకు చెందిన టింగ్జి లీపై అద్భుత విజయం సాధించింది. 

తొలి రెండు గేములు స్కోర్లు సమం కావడంతో పోరు టైబ్రేక్‌కు దారితీసింది. మొత్తం ఎనిమిది రౌండ్లలో రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుకుంటూ వచ్చింది. ర్యాపిడ్‌ స్టయిల్‌లో తొలి రెండు టైబ్రేక్‌లు డ్రా కావడంతో ఇద్దరి ప్లేయర్ల స్కోర్లు 2-2తో సమం అయింది.

అయితే, మూడో ర్యాపిడ్‌ రౌండ్‌లో హంపి తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న టింగ్జి విజయం సాధించి ఆధిక్యాన్ని 3-2కు పెంచుకుంది. కానీ, వెంటనే పుంజుకున్న హంపి నాలుగో రౌండ్‌లో తెల్లపావులతో ఆడి.. చైనా ప్లేయర్‌కు చెక్‌ పెట్టడంతో స్కోరు మ‌ళ్లీ 3-3తో స‌మమైంది. ఇక‌, ఆ తర్వాత జరిగిన రెండు బ్లిట్జ్‌ గేముల్లో హంపినే విజయం వరించింది. 

తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడి, టింగ్జి భరతం పట్టిన హంపి ఆధిక్యాన్ని 4-3కు పెంచుకుంది. అదే దూకుడుతో ఆఖరిదైన రెండో గేమ్‌లో నల్లపావులతో చైనా ప్లేయర్‌ను ఓడించడంతో హంపి గెలుపు ఖరారైంది. ఈ నెల 26, 27 తేదీల్లో టోర్నీ ఫైనల్‌ పోరు జ‌ర‌గ‌నుంది. దీంతో ఇప్ప‌టికే ఫైన‌ల్ చేరిన మ‌రో ఇండియ‌న్ ప్లేయ‌ర్ దివ్య దేశ్‌ముఖ్‌తో హంపి త‌ల‌ప‌డనుంది. 
FIDE Womens World Cup
Koneru Humpy
Divya Deshmukh
Chess World Cup
Tingjie Lei
Indian Chess Players
Chess Tournament
Womens Chess
Chess Finals
India Chess

More Telugu News