Australia Racism: ఆస్ట్రేలియాలో మరో జాత్యాహంకార ఘటన.. ఆలయంపై పిచ్చి రాతలు

Australia Racism Another Racist Incident at Temple in Australia
  • మెల్‌బోర్న్‌లో హిందూ ఆలయంపై విద్వేషపూరిత రాతలు
  • స్వామి నారాయణ్ ఆలయంపై పిచ్చి రాతలు
  • గోడలపై హిట్లర్ చిత్రాన్ని వేసి, 'గో హోమ్ బ్రౌన్' అంటూ రాతలు
ఆస్ట్రేలియాలో మరో జాత్యాహంకార ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లోని బోరోనియాలో గల హిందూ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. ఆస్ట్రేలియాలో ఒక భారతీయ విద్యార్థిపై దాడి జరిగిన ఘటన మరవకముందే ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.

స్వామి నారాయణ్ ఆలయం వద్ద ఈ నెల 21న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆలయం గోడలపై హిట్లర్ చిత్రాన్ని వేసి, దానిపై 'గో హోమ్ బ్రౌన్' అని రాశారు. ఇదే ప్రాంతంలోని ఆసియా దేశాల వారు నడిపే హోటళ్లపై కూడా ఇలాంటి విద్వేషపూరిత రాతలే రాసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇలాంటి చర్యలు భక్తులను, స్వచ్ఛంద సేవకుల హృదయాలను కలచివేస్తున్నాయని హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలు శాంతి, భక్తి, ఐక్యతకు నిలయంగా ఉంటాయని, అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని ఇలా జాత్యాహంకార చేష్టలకు పాల్పడటం సరైనది కాదని ఆయన అన్నారు.

ఈ ఘటనను విక్టోరియా ప్రీమియర్ జసింత్ అల్లన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులకు ఆమె లేఖ రాశారు. విద్వేషంతో కూడిన జాత్యాహంకార ఘటన తమను కలిచివేసిందని అన్నారు. ఇది విధ్వంసం మాత్రమే కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన ద్వేషపూరిత చర్య అని అన్నారు. విక్టోరియాలో ఇలాంటి దాడులకు చోటు లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు.
Australia Racism
Racism
Swami Narayan Temple
Melbourne
Boronia
Hindu Council of Australia

More Telugu News