CPI Narayana: ఇలాంటి సినిమాలకా మీరు సాయం చేసేది?: చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై సీపీఐ నారాయణ ఫైర్

CPI Narayana Fires on Chandrababu and Revanth Reddy Over Cinema Subsidies
  • ఆర్.నారాయణమూర్తిని చూసి చంద్రబాబు, రేవంత్ సిగ్గుపడాలన్న నారాయణ
  • నారాయణమూర్తి సందేశాత్మక చిత్రాలు తీస్తాడని వెల్లడి
  • అలాంటి చిత్రాలకు మాత్రం రాయితీ ఇవ్వరని విమర్శలు
  • ఎర్రచందనం, బ్లాక్ మనీ, క్రైమ్ ను ప్రోత్సహించే చిత్రాలకు రాయితీ ఇస్తారని ఆగ్రహం
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తిని చూసి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

"నారాయణమూర్తి 'యూనివర్సిటీ' అనే సినిమా తీశాడు. అందులో ప్రశ్నాపత్రాల లీకేజి గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎలా ప్రభావితం అవుతారు, ఎంత బాధపడతారు అనేది చూపించారు. ఒక సందేశాత్మక కోణంలో ఆ చిత్రాన్ని తీశారు. ఆ సినిమా ప్రివ్యూ చూశాను. నాకే ప్రభుత్వ సహాయం అక్కర్లేదని నారాయణమూర్తి అంటున్నాడు. అలాంటి నారాయణమూర్తిని చూసి సిగ్గుతెచ్చుకోవాలి. 

కోట్ల రూపాయలతో సినిమాలు తీసేవాళ్లకు మీరు రాయితీలు ఇస్తారా? ఏపీ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ... పవన్ కల్యాణ్ సినిమాకు, పుష్ప సినిమాకు, బాహుబలి సినిమాకు... ఇలాంటి వాటికి రాయితీ ఇవ్వడం ఏంటి? టికెట్ రేట్లు పెంచుకోమనడం, బ్లాక్ లో అమ్ముకోమనడం ఏంటి? ఇది దివాలాకోరు రాజకీయం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి పనులను ప్రజలు అసహ్యించుకుంటారు. ఈ సినిమాల్లో ఏవైనా సందేశం ఇచ్చారా? 

అటు, సందేశాత్మక చిత్రాలకేమో మీరు సాయం చేయడంలేదు... ఎర్రచందనం అమ్ముకోండి, బ్లాక్ మనీ చేసుకోండి, క్రైమ్ చేసుకోండి, కొట్టుకోండి, చంపుకోండి అంటూ హింసాత్మకంగా సాగే సినిమాలకు మీరు రాయితీలు ఇస్తున్నారు… సమాజానికి ఉపయోగపడే సినిమాలకు మాత్రం మీరు రాయితీలు ఇవ్వడంలేదు... ఇంతకంటే దివాలాకోరు రాజకీయం ఉంటుందా?" అని దుయ్యబట్టారు.
CPI Narayana
Narayana Murthy
Chandrababu Naidu
Revanth Reddy
University movie
Telugu cinema subsidies
AP politics
Telangana politics
Question paper leaks
Tollywood

More Telugu News