Chintakayala Ayyanna Patrudu: సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో తిరుపతిలో జాతీయ మహిళా సాధికారిత సదస్సు

National Women Empowerment Conference in Tirupati says Speaker Ayyanna Patrudu
  • జాతీయ మహిళా సాధికారిత సదస్సుపై సమీక్ష నిర్వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు
  • ఎప్పటికీ గుర్తుండిపోయేలా సదస్సు నిర్వహిస్తామన్న అయ్యన్న పాత్రుడు
  • సదస్సులో చర్చించిన అంశాలు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి
సెప్టెంబరు 14, 15 తేదీల్లో తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు నిర్వహించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతి కలెక్టరేట్‌లో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి ఆయన సదస్సు నిర్వహణపై జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు.

దేశంలోని 31 అసెంబ్లీలలో మహిళా కమిటీలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కమిటీల ద్వారా అనేక సమస్యలపై చర్చలు జరుగుతుంటాయని తెలిపారు. ప్రతి సమస్యను స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పరిష్కరించాలంటే కష్టమైన పనని, అందుకోసమే ఇలాంటి సదస్సులు నిర్వహించి అందులో చర్చా విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ నేపథ్యంలోనే చట్టసభల జాతీయ మహిళా సాధికారిత సభ్యుల సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

తొలుత విశాఖలో నిర్వహించాలని అనుకున్నా శ్రీవారు కొలువైన తిరుపతిలో నిర్వహించాలని పార్లమెంట్‌ స్పీకర్‌ ఓంబిర్లా సూచించారన్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెప్టెంబరు 14, 15 తేదీలలో తిరుపతిలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురు, ప్రతి అసెంబ్లీ నుంచీ ఆరుగురు చొప్పున మహిళా ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన చెప్పారు. ఇలా 300 మందికి పైగా హాజరయ్యే సభ్యులు రెండు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఆ నివేదికను పార్లమెంటు, అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు.

సదస్సు అనంతరం సభ్యులు తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీసిటీ, శ్రీహరికోట, చంద్రగిరి కోటను సందర్శిస్తారని చెప్పారు. వీరి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మహిళాభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఎక్కడా లేనివిధంగా చట్టసభల్లో, పదవుల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు. 
Chintakayala Ayyanna Patrudu
National Women Empowerment Conference
Tirupati
Andhra Pradesh Assembly
Om Birla
Women Representatives
Legislative Assemblies
Women in Politics
Chandrababu Naidu
TTD

More Telugu News