Divya Deshmukh: చ‌రిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్‌.. తొలి భార‌తీయ మ‌హిళ‌గా అరుదైన ఘ‌న‌త‌

Divya Deshmukh Creates History at FIDE Womens World Cup
  • ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా దివ్య రికార్డ్‌
  • సెమీఫైనల్ లో చైనాకు చెందిన తాన్ ఝోంగీని 1.5-0.5 తేడాతో ఓడించిన వైనం
  • ఈ విజయంతో దివ్య‌కు మొదటి గ్రాండ్ మాస్టర్ (జీఎం) నార్మ్‌
  • అలాగే 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కూడా అర్హ‌త
భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఆమె సెమీఫైనల్ లో మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ ఝోంగీని 1.5-0.5 తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. 

ఈ విజయంతో ఆమె తన మొదటి గ్రాండ్ మాస్టర్ (జీఎం) నార్మ్‌ను కూడా సాధించింది. మ‌హారాష్ట్ర‌కు చెందిన‌ 19 ఏళ్ల దివ్య తెల్లపావులతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో పాటు ఆమె 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కూడా అర్హ‌త సాధించింది.

ప్రపంచ నంబర్ 18 అయిన దివ్య మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ మొదటి గేమ్‌లో నల్లపావులతో ఆడి డ్రా చేసుకుంది. అయితే, నిన్న జ‌రిగిన రెండో గేమ్‌లో ఆమెకు తెల్లపావులతో ఆడటం ప్రయోజనకరంగా మారింది. ఆమె మిడ్ గేమ్‌లో తాన్ ఝోంగీ చేసిన తప్పులను అనుకూలంగా మార్చుకుని దూసుకెళ్లింది. అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకుని అద్భుత‌ విజయంగా మార్చుకుంది. ప్ర‌త్య‌ర్థిని 101 ఎత్తుల్లో ఓడించి ఫైన‌ల్‌కి అర్హ‌త సాధించింది. ఈ గెలుపు భారత మహిళా చెస్‌కు గొప్ప విజయమ‌ని చెప్పొచ్చు.

టై బ్రేకర్ ఆడనున్న కోనేరు హంపి
ఇదిలా ఉండగా.. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండో సెమీఫైనల్ చైనాకు చెందిన లీ టింగీతో డ్రా అయింది. ఇప్పుడు ఆమె టై-బ్రేక్ ఆడనుంది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు ఈ రోజు రాపిడ్, బ్లిట్జ్ టై-బ్రేక్ గేమ్స్ ఆడతారు. దీని ద్వారా ఫైనల్‌లో రెండో స్థానం ఎవరికి లభిస్తుందో తెలుస్తుంది. ఇందులో గెలిచిన విజేత‌తో దివ్య దేశ్‌ముఖ్ ఫైన‌ల్ ఆడుతోంది. 
Divya Deshmukh
FIDE Womens World Cup
Tan Zhongyi
Koneru Humpy
chess grandmaster
Indian chess
Li Tingjie
Womens Candidates Tournament 2026
chess tournament
chess world cup

More Telugu News