Sajjala Ramakrishna Reddy: అనుబంధ విభాగాలన్నీ ఫోకస్ గా ముందుకెళ్లాలి: సజ్జల

Sajjala Ramakrishna Reddy Focus on YSRCP Affiliated Units
  • వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశం
  • అనుబంధ విభాగాల కమిటీలు అన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్న సజ్జల 
  • క్రియాశీలకంగా ఉండగలిగే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలన్న సజ్జల
వైసీపీ అనుబంధ విభాగాలు మరింత దృష్టి సారించి ముందుకు సాగాలని, సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిన్న అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి నేతలకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉన్నప్పుడే పార్టీ ప్రతిష్టను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలుగుతామని, తద్వారా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి మార్గం సుగమం చేయాలని ఆయన అన్నారు.

కమిటీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతుందని సజ్జల పేర్కొన్నారు. అనుబంధ విభాగాల కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పదవులు అలంకారప్రాయం కాకుండా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పదవులు పొందిన వారంతా వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.

క్రియాశీలకంగా ఉండగలిగే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మనమంతా పార్టీని బలోపేతం చేసి మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు మనమంతా గట్టిగా పనిచేద్దామని అన్నారు. ప్రజల తలరాతలు మారాలన్నా, వారికి మంచి భవిష్యత్తు అందాలన్నా జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. 
Sajjala Ramakrishna Reddy
YSRCP
YSR Congress Party
Aluru Sambasiva Reddy
Andhra Pradesh Politics
AP Elections
YSRCP cadre
political committees
Jagan Mohan Reddy
political strategy

More Telugu News