Vijay Deverakonda: డెంగ్యూ నుంచి కోలుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Vijay Deverakonda Recovering from Dengue Discharged from Hospital
  • మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నట్లు వెల్లడించిన హీరో టీమ్ సభ్యుడు
  • జూలై 31న విడుదల కానున్న 'కింగ్‌డమ్' 
  • ప్రమోషన్, ప్రీ-రిలీజ్ వేడుకల్లో పాల్గొననున్న విజయ్
డెంగ్యూతో బాధపడుతున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నటించిన 'కింగ్‌డమ్' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆసుపత్రి నుంచి విడుదలైన విజయ్ దేవరకొండ వేగంగా కోలుకుంటున్నారని ఆయన బృందం ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది.

విజయ్ దేవరకొండ టీమ్ సభ్యుడు ఒకరు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, "అవును. విజయ్ దేవరకొండ డెంగ్యూతో బాధపడుతున్నారు. మొదట్లో ఆయనకు జ్వరం మాత్రమే వచ్చిందని, ఇంట్లోనే కోలుకోవచ్చని భావించారు. కానీ డాక్టర్ ఆయనకు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారించారు. ఆయన డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ మూడు రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు" అని తెలిపారు.

'కింగ్‌డమ్' చిత్రం జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో తిరిగి ఉత్సాహంగా పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలను కొన్నింటిని ముందుగానే చిత్రీకరించారు. అవి త్వరలో బయటకు రానున్నాయి. వచ్చే వారం ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

'కింగ్‌డమ్' ట్రైలర్ జూలై 26న విడుదల కానుంది. జూలై 28న సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఉంది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫార్చూన్ 4 సినిమాస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై సాయిసౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తొలుత మే 30న, ఆ తర్వాత జులై 4న, అనంతరం జూలై 31కి వాయిదా పడింది.

Vijay Deverakonda
Vijay Deverakonda dengue
Kingdom movie
Gowtam Tinnanuri

More Telugu News