Vijay Antony: స్టార్ హీరోలు రాజకీయాల్లోకి రావడం, తన రాజకీయ ఆరంగేట్రంపై విజయ్ ఆంటోనీ ఏమన్నారంటే?

Vijay Antony on Political Entry and Bhadrakali Movie
  • ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలంటే రాజకీయ రంగమే మార్గమని వెల్లడి
  • ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉంటే రాజకీయ రంగంలోకి వెళ్లవచ్చని వ్యాఖ్య
  • తనకు రాజకీయ రంగంపై ఆసక్తిలేదని స్పష్టీకరణ
ప్రజలకు సంపూర్ణంగా సేవ చేయాలంటే రాజకీయ రంగమే సరైన వేదిక అని ప్రముఖ సినీ నటుడు విజయ్ ఆంటోనీ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'భద్రకాళి' చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ప్రముఖ నటులు రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏమిటని విలేకరి అడిగిన ప్రశ్నకు విజయ్ ఆంటోనీ సమాధానమిస్తూ, ప్రజలకు సేవ చేయాలనే తలంపు ఉంటే రాజకీయాలు సరైన మార్గమని అన్నారు. వ్యక్తిగతంగా సేవ చేస్తే పరిమిత సంఖ్యలో ప్రజలకు మాత్రమే సహాయం చేయగలమని, అదే రాజకీయాల్లోకి వస్తే ఒకేసారి ఎంతోమందికి మేలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉన్న ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లవచ్చని తెలిపారు. అయితే, తనకు రాజకీయ రంగంపై ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

'భద్రకాళి' చిత్రం రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా అనే చర్చ జరుగుతున్న విషయంపై కూడా విజయ్ ఆంటోనీ స్పందించారు. ఈ చిత్రంలో తమిళనాడు రాజకీయాలను చూపించారా అని విలేకరులు ప్రశ్నించగా, రాజకీయాలు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయని ఆయన అన్నారు. తమిళనాడు రాజకీయాలు, అమెరికా రాజకీయాలు అంటూ వేర్వేరుగా ఉండవని అభిప్రాయపడ్డారు. తన సినిమాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఇది ఒక సాధారణ రాజకీయ చిత్రం మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.
Vijay Antony
Vijay Antony Bhadrakali
Bhadrakali movie
Tamil Nadu politics
Indian politics

More Telugu News