Nara Lokesh: మా దేశంలో పర్యటించండి... నారా లోకేశ్ ను ఆహ్వానించిన యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్

Nara Lokesh Invited to UAE by Economy Minister Abdul Bin Taql Al Mari
విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సు
హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్, యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్
యూఏఈ సహకారంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటామన్న లోకేశ్ 
డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన పాల్గొని, ఎఐ మరియు డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మాట్లాడారు. 

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఏఐ సాంకేతికత అభివృద్ధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ)ని ఆదర్శంగా తీసుకుంటున్నామని, ప్రపంచంలోనే తొలిసారి ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన దేశం యుఎఈ అని లోకేశ్ గుర్తు చేశారు. యుఏఈ సహకారంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సదస్సులో యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ ఆల్ మరితో మంత్రి లోకేశ్ సమావేశమై, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ గవర్నెన్స్, ఎఐ ఫస్ట్ యూనివర్సిటీ, జీనోమ్ సీక్వెన్సింగ్, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఈ రంగాల్లో సహకారం అందించాలని యుఏఈని కోరగా, అబ్దుల్ బిన్ సానుకూలంగా స్పందిస్తూ లోకేశ్ ను యుఏఈ పర్యటనకు ఆహ్వానించారు.

ఈ సదస్సులో లోకేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంశంపైనా మాట్లాడారు. దక్షిణాసియాలోనే మొట్టమొదటి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను రాష్ట్ర రాజధాని అమరావతిలో జనవరి 2026లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంను డేటా సిటీగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, అంతర్జాతీయ సంస్థలు విశాఖలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు.

విద్యారంగంలో సమూల మార్పులపై దృష్టి సారిస్తున్నామని, ఎఐ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్‌ను కరిక్యులంలో చేర్చి, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు లోకేష్ తెలిపారు. రోజువారీ పరిపాలనలో ఎఐని వినియోగించి, ప్రజలకు సులభతరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 'మనమిత్ర' పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టి, 600 రకాల పౌర సేవలను వేగవంతంగా అందిస్తున్నామని, ఇందుకోసం వివిధ శాఖలను అనుసంధానిస్తూ భారీ డేటా లేక్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో జి42 ఇండియా సీఈఓ మను జైన్, ప్రైమస్ పార్టనర్స్ వైస్ ప్రెసిడెంట్ రక్ష శ్రద్ధ వ్యాఖ్యాతగా పాల్గొన్నారు. ఎఐ, డేటా సెంటర్లు, స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించే మార్గాలను అన్వేషిస్తామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.
Nara Lokesh
Andhra Pradesh
UAE
Artificial Intelligence
Data Centers
Investment
Digital Economy
Quantum Computing
Visakhapatnam
Abdul Bin Taql Al Mari

More Telugu News