Anand Mahindra: పారిశుద్ధ్య కార్మికుడు కాదు... రిటైర్డ్ డీఐజీ!... ఆసక్తికర ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra praises 88 year old Inderjit Singh Sidhu for cleanliness drive
  • చండీగఢ్ లో ప్రతి రోజు చెత్తను ఏరివేసే రిటైర్డ్ పోలీస్ అధికారి
  • 88 ఏళ్ల వయసులో ప్రతిరోజూ సైకిల్ రిక్షాతో చెత్త ఏరివేత
  • నిశ్శబ్ద స్వచ్ఛతా యోధుడికి నా సలాం అంటూ ఆనంద్ మహీంద్రా స్పందన
ప్రస్తుత కాలంలో యువతరం ఏ పనైనా అప్పటికప్పుడు జరిగిపోవాలని కోరుకుంటుంది. అయితే, ఛండీగఢ్ లో 88 ఏళ్ల వృద్ధుడు మాత్రం పరిశుభ్రత కోసం ఎన్నో ఏళ్లుగా అలుపెరగని రీతిలో కృషి చేస్తున్నారు. సేవ చేయడమే జీవితమని చాటి చెబుతున్నారు. ఎప్పటికైనా సమాజంలో మార్పు వస్తుందని గట్టిగా నమ్ముతూ, నగరంలో ప్రతి రోజు చెత్త ఏరివేస్తుంటారు. ఆయనే చండీగఢ్ సెక్టార్ 49కి చెందిన రిటైర్డ్ డీఐజీ ఇందర్ జిత్ సింగ్ సిద్ధు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా సిద్ధు సేవాభావాన్ని వేనోళ్ల కొనియాడారు. ఆయనను 'స్వచ్ఛతా యోధుడు' అని అభివర్ణించారు. "ఈ నిశ్శబ్ద స్వచ్ఛతా యోధుడికి నా సలాం!" అని ప్రశంసించారు.

"ప్రతిరోజు ఉదయం 6 గంటలకే సిద్ధు గారు తన సైకిల్ రిక్షా వంటి బండితో బయలుదేరుతారు. చండీగఢ్ సెక్టార్ 49లోని రోడ్ల పక్కన పడి ఉన్న చెత్తను ఏరివేస్తూ ముందుకు సాగుతారు. జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చండీగఢ్‌కు మంచి ర్యాంకు రాకపోవడం ఆయనను బాధించింది. కానీ ఆయన కేవలం ఫిర్యాదులు చేయకుండా, స్వయంగా రంగంలోకి దిగి పని చేయడం ప్రారంభించారు.

ఆయన తీసే ప్రతి చెత్త ముక్క ఒక సందేశం వంటిదే. వయసుతో సంబంధం లేకుండా, మన జీవితానికి ఒక అర్థం ఉండాలని, ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించడానికి కృషి చేయాలని ఆయన నమ్ముతారు. మంచి చేయాలనే ఆలోచనకు రిటైర్‌మెంట్ ఉండదు, సేవకు వయసు అడ్డు కాదు అని సిద్ధు పని నిరూపిస్తోంది" అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

Anand Mahindra
Inderjit Singh Sidhu
Chandigarh
Swachh Bharat
cleanliness drive
social service
retired DIG
Indian cities
sanitation
social media

More Telugu News