Montana Plane Crash: మిస్సింగ్ విమానం జాడ చెప్పిన స్మార్ట్ వాచ్.. అమెరికాలో ఘటన

Montana Plane Crash Location Found by Smart Watch
  • మోంటానా రాష్ట్రంలో అడవిలో కూలిన చిన్న విమానం.. ముగ్గురు మృతి
  • ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన రెస్క్యూ బృందాలు
  • ఓ ప్రయాణికుడి చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ సాయంతో కూలిన ప్రాంతం గుర్తింపు
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఓ విమానం అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ తో పాటు ముగ్గురు చనిపోయారు. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యం కావడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కనిపించకుండా పోయిన విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్న సింగిల్ ఇంజిన్ విమానాన్ని వెతకడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే, విమానంలో ప్రయాణించిన ముగ్గురిలో ఒకరి చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ సహాయంతో విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించామని వెల్లడించారు. యెల్లోస్టోన్ జాతీయ పార్క్ సమీపంలో విమానం శకలాలు కనిపించాయన్నారు.  

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం..  పైపర్ PA-28 మోడల్ సింగిల్ ఇంజిన్ విమానం గురువారం అర్ధరాత్రి సమయంలో వెస్ట్ యెల్లోస్టోన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. గాల్లోకి లేచిన కాసేపటికే గల్లంతయ్యింది. విమానంతో కమ్యూనికేషన్ కట్ కావడంతో రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న ముగ్గురిలో ఒకరి చేతికి స్మార్ట్ వాచ్ ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ వాచ్ సిగ్నల్ ఎక్కడ ఆగిపోయిందనే వివరాలతో విమానం కోసం గాలించారు. అరగంటలోపే ఆ సిగ్నల్ ఆధారంగా విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో పైలట్ సహా మొత్తం ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు.
Montana Plane Crash
Plane Crash
Smart Watch
Yellowstone National Park
Piper PA-28
Aviation Accident
US Plane Crash
Missing Plane

More Telugu News