Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌ రాజీనామా.. ప్రధాని మోదీ ఏమ‌న్నారంటే..!

Wishing him good health PM Modi on Jagdeep Dhankhars resignation
  • అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌
  • ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమేనంటూ రాజీనామా లేఖ‌
  • ఆయన రాజీనామాను తాజాగా ఆమోదించిన రాష్ట్రపతి 
  • ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని మోదీ ట్వీట్‌
ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం రాత్రి రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు పంపారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి తాజాగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. 

ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదికగా ప్ర‌ధాని మోదీ స్పెష‌ల్‌ పోస్టు పెట్టారు.

కాగా, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఎ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. 

ఇదిలాఉంటే... మరో రెండు సంవత్సరాలు పదవీకాలం ఉండగానే జ‌గ‌దీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ కావడంతో ఆయన బెంగాల్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్‌ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా ఆయ‌న‌ రికార్డులకెక్కారు. 
Jagdeep Dhankhar
PM Modi
Vice President
Resignation
Narendra Modi
Droupadi Murmu
Health Reasons
Article 67A
NDA Candidate
Margaret Alva
Highest Votes

More Telugu News