KNP Logistics: బలహీనమైన పాస్ వర్డ్ వల్ల 158 ఏళ్ల కంపెనీ మూత.. 700 మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

KNP Logistics Shuts Down After Cyber Attack Due to Weak Password
  • ఒక్క దెబ్బకు కంపెనీ క్లోజ్.. వీక్ పాస్ వర్డ్ కారణంగా సైబర్ అటాక్
  • కంపెనీ సిస్టంలోకి చొరబడిన సైబర్ నేరస్థులు
  • భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పాలని డిమాండ్
  • అంత ఇచ్చుకోలేక మూతపడనున్న కంపెనీ
పాస్ వర్డ్ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం ఒక కంపెనీ మూతపడడానికి దారితీసింది. 158 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఆ సంస్థ ప్రస్తుతం మూతపడనుంది. దీంతో 700 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. దీనంతటికీ కారణం ‘బలహీనమైన పాస్ వర్డ్’.. పాస్ వర్డ్ పటిష్ఠంగా లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు కంపెనీ సిస్టమ్ లోకి ఎంటరై కీలకమైన సమాచారాన్ని తమ నియంత్రణలో పెట్టుకున్నారు. ఉద్యోగులకు ఆ సమాచారం అందకుండా చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. యూకేకు చెందిన ప్రఖ్యాత లాజిస్టిక్ కంపెనీ ‘కెఎన్ పీ లాజిస్టిక్’ కి ఎదురైందీ సంకట పరిస్థితి.

కంపెనీకి చెందిన 500 లారీలు నిత్యం కస్టమర్ల సరుకులను దేశవిదేశాలకు చేరవేస్తుంటాయి. ‘నైట్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్’ పేరుతో ఈ లారీలు తిరుగుతుంటాయి. అయితే, ఇటీవల కంపెనీ ఉద్యోగులలో ఒకరి పాస్ వర్డ్ ను ఊహించిన హ్యాకర్లు.. కేఎన్ పీ సిస్టంలోకి ఎంటరయ్యారు. సంస్థ ఉద్యోగులకు పలు కీలక సమాచారం పొందేందుకు వీలు లేకుండా చేశారని కేఎన్ పీ డైరెక్టర్ పాల్ అబాట్ వివరించారు.

హ్యాకర్లు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని, అంత మొత్తం ఇచ్చుకునే పరిస్థితి లేదన్నారు. దీంతో తమ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ కంపెనీని మూసేయడమేనని చెప్పారు. అయితే, హ్యాకర్లు ఎంత డిమాండ్ చేశారనేది పాల్ అబాట్ వెల్లడించలేదు. సైబర్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ హ్యకింగ్ అకీరా గ్యాంగ్ పనే అయి ఉంటుందని, 50 లక్షల పౌండ్స్ డిమాండ్ చేసి ఉంటారని అంచనా. కాగా, ఈ సైబర్ అటాక్ కారణంగా కంపెనీ మూతపడితే సంస్థలోని 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు.
KNP Logistics
KNP Logistics cyber attack
cyber attack
weak password
logistics company
UK company closure
Akira gang
ransomware
data breach

More Telugu News