Chandrababu Naidu: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం... ‘జీరో ఫేర్ టిక్కెట్లపై సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Naidu Orders Zero Fare Tickets for Women Free Bus Scheme
  • గత ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి
  • మహిళలకు వెసులబాటు కలిగించనున్న పథకం
  • నేడు సమీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి అమలు కానుంది. ఈ పథకంలో భాగంగా మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్' జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

సోమవారం నాడు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ జీరో ఫేర్ టిక్కెట్‌లో ప్రయాణికుల ప్రయాణ వివరాలు, ఉచిత ప్రయాణం వల్ల వారికి ఆదా అయిన మొత్తం, మరియు ప్రభుత్వం 100 శాతం రాయితీని ఇస్తుందనే వివరాలను స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. దీనివల్ల రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులందరికీ తాము ఎంత లబ్ధి పొందారనే విషయం సులభంగా తెలుస్తుందని అన్నారు. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాల అమలు, వాటి ఆర్థిక భారంపై కూడా అధికారులతో చర్చించారు. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి: ముఖ్యమంత్రి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు నేపథ్యంలో ఆర్టీసీకి ఆర్థిక భారం తగ్గించి, సంస్థను లాభాల బాట పట్టించే మార్గాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఆదాయ మార్గాలను పెంపొందించడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభసాటిగా మార్చాలని సూచించారు. లాభాల ఆర్జన కోసం ఎలాంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించాలని కోరారు.

ఇకపై ఏసీ ఎలక్రిక్ బస్సుల కొనుగోలుకు ప్రాధాన్యత

రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చడం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని అన్నారు. ఈ బస్సులకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా ఆర్టీసీ స్వయంసమృద్ధి సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Chandrababu Naidu
APSRTC
Free Bus Travel
Andhra Pradesh
Women Free Bus Scheme
Zero Fare Ticket
AP News
Electric Buses
RTC Profits
August 15

More Telugu News