Mamata Banerjee: బీజేపీ దానిని ఆపకుంటే మా ప్రతిఘటనను ఢిల్లీకి వినిపిస్తాం: మమతా బెనర్జీ

Mamata Banerjee Warns BJP of Resistance Reaching Delhi
  • బెంగాల్‌పై బీజేపీ, ఈసీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపణ
  • ఓటర్ల జాబితా నుంచి బెంగాలీలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమత
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను వేధిస్తున్నారన్న మమతా బెనర్జీ
బెంగాల్ ప్రజలను, వారి భాషను బీజేపీ తక్కువ చేసి చూస్తోందని, ఈ పద్ధతిని ఆపకుంటే తమ ప్రతిఘటన ఢిల్లీకి వినిపిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి బెంగాలీలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు, మహిళలు ఎందుకు వేధింపులకు గురవుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.

బెంగాల్‌లో అధికార మార్పిడి జరిగితే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. బెంగాల్ భాషపై బీజేపీ చూపుతున్న వివక్షకు నిరసనగా ఈ నెల 27 నుంచి భాషా ఉద్యమం చేపట్టబోతున్నట్లు ఆమె ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలుస్తామని, ఆ తర్వాత ఢిల్లీ పీఠాన్ని కదిలించే దిశగా ముందుకు సాగుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

యాభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ తీసుకువచ్చిన ఎమర్జెన్సీని బీజేపీ పదేపదే గుర్తు చేస్తుంటుందని, కానీ అంతకుమించి బీజేపీ సూపర్ ఎమర్జెన్సీని అమలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీహార్‌లో బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగిస్తున్నారని, పశ్చిమ బెంగాల్‌లో అలా చేస్తే సహించేది లేదని అన్నారు. వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని హెచ్చరించారు.
Mamata Banerjee
West Bengal
BJP
Trinamool Congress
Delhi
Bengali Language

More Telugu News